బళ్లారిటౌన్: నాడోజ బెళగల్ ఈరణ్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా గురువారం సీనియర్ రంగస్థల కళాకారులను సన్మానించారు. సంగనకల్లు గ్రామంలోని ఆదర్శ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బెళగల్ ఈరణ్ణ కుమారుడు మల్లికార్జున నేతృత్వంలో కళాకారుల బృందం నగరంలోని సీనియర్ కళాకారిణులు సుజాతమ్మ, కణేకల్ రంగమ్మ, కళాకారుడు చెన్నబసప్పల ఇళ్లకు వెళ్లి సన్మానించారు. సీనియర్ కళాకారులు హెచ్‌ఎన్ చంద్రశేఖర్, మోకా రామేశ్వర్, కే.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకారం
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా నూతన ఇన్‌చార్జి బీఈఓగా శేఖర్ హొరపేటె గురువారం అధికార బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు బీఈఓగా ఉన్న చిన్నబసప్ప రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి బీఈఓగా శేఖర్ హొరపేటెను నియమిస్తూ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. నూతన అధికారిని ఉపాధ్యాయ సంఘం నేతలు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు సుధాదేవి, కార్యదర్శి మల్లయ్య, వరప్రసాద్, విజయకుమారి, కుబేరాచారి, మార్గదప్ప, ప్రకాష్, హేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ తీగ తెగి పడి ఉపాధ్యాయిని మృతి
హొసపేటె: స్కూల్‌కి వెళ్తుండగా విద్యుత్ తీగ తెగి మీద పడటంతో పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని జంగమర కల్గుడిలో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి ఆమైపె పడటంతో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన ఉపాధ్యాయురాలిని జంగమర కల్గుడి గ్రామం హొసకేర రోడ్డుకు చెందిన హరిత శ్రీనివాస్(26)గా గుర్తించారు. ఆమె విద్యానగర్‌లోని శ్రీగొట్టిపాటి వెంకటరత్నం మెమోరియల్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం దేవదుర్గలో బాబూ జగ్జీవన్ రాం భవనంలో మౌలిక సౌకర్యాలకు రూ.52 లక్షలతో రక్షణ గోడ, మరుగుదొడ్డి, స్నానపు గదుల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. జగీజవన్‌రాం భవన్‌ను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడతామన్నారు. ఈ సందర్భంగా జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, అజీజ్, అస్లాంపాషా, సత్యనాథ్‌లున్నారు.
పేదల స్థలం కబ్జాపై చర్యలేవీ?
బళ్లారి అర్బన్: బళ్లారి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 32వ వార్డు బండిహట్టిలో పురాతన దళితుల బావిని, చుట్టు పక్కల స్థలాన్ని అక్రమంగా కబ్జాకు పాల్పడిన వారి నుంచి ఆ స్థలాన్ని రక్షించాలని కోరుతూ బండిహట్టి నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు కర్ణాటక ఏకీకరణ రక్షణ సేన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పీ.శేఖర్ నేతృత్వంలో భారీ ఆందోళన ర్యాలీ చేపట్టారు. ఆ సంఘం జిల్లాధ్యక్షుడు కృష్ణ వాల్మీకి, మహిళా జిల్లాధ్యక్షురాలు లక్ష్మిదేవి, పద్మావతి, ఆ వార్డు శాఖ పదాధికారులు పేదలకు అండగా పాదయాత్రతో అదనపు జిల్లాధికారికి వినతిపత్రం అందజేసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సంఘం ప్రముఖురాలు రోహిణి, ఈరమ్మ, మల్లికార్జున, రమేష్, బసవరాజ్, నీలప్ప, విరుపాక్షిరెడ్డి, గోవింద, తదితరులు పాల్గొన్నారు.

రంగస్థల కళాకారులకు సన్మానం