
జూనియర్ భోగేశ్వర్ కన్నుమూత
మైసూరు: రెండు ఏనుగుల మధ్య జరిగిన పోట్లాటలో పొడవాటి దంతాలు కలిగిన జూనియర్ భోగేశ్వర్‌గా పేరొందిన ఏనుగు అసువులు బాసింది. ఈ దుర్ఘటన జిల్లాలోని కబిని డ్యాం పరిధిలోని డీబీ కుప్పె, అంతరసంతె అటవీ వలయంలో జరిగింది. ఈ ప్రాంతంలో పొడవాటి దంతాలు కలిగిన కొన్ని ఏనుగులు ఉన్నాయి. వాటిలో ఆసియాలోనే ఎక్కువగా.. 8 అడుగుల అతి పొడవైన దంతాలు కలిగిన మిస్టర్ కబిని లేదా భోగేశ్వర్ అనే 68 ఏళ్ల ఏనుగు ఖ్యాతి పొందింది. ఈ ఏనుగు 2022 జూన్ 10న మరణించింది. ఆ తరువాత భోగేశ్వర్ ఏనుగును పోలినట్లుగా ఉన్న పొడవైన దంతాల మరో ఏనుగు ఒకటి సంచరిస్తోంది. దీనికి కొందరు వన్యజీవి ఛాయాగ్రాహకులు జూనియర్ భోగేశ్వర్‌గా పేరు పెట్టారు.
ఫలించని చికిత్సలు
డీబీ కుప్పె వన్యజీవి వలయపు కబిని పోటు జలాల ప్రాంతంలోని కొల్లి అనే చోట ఈ మగ ఏనుగు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అటవీ సిబ్బంది గమనించారు. మరో అడవి ఏనుగుతో జరిగిన పోట్లాటలో గాయపడినట్లుగా తెలిసింది. చికిత్స చేపట్టినప్పటికీ అది గాయాల తీవ్రతతో కన్నుమూసింది.
జూనియర్ నేలకొరగడం స్థానికులకు, అటవీ సిబ్బందికి బాధ కలిగించింది. సోషల్ మీడియాలో జూనియర్ భోగేశ్వర్ ఏనుగు మరణ వార్త చిత్రాలతో వైరల్‌గా మారింది. ప్రజలు నివాళులర్పించారు. పులుల సంరక్షిత ప్రదేశం డైరెక్టర్ పీఏ సీమా, మేటికుప్పె ఉప విభాగపు ఏసీఎఫ్ ఎస్‌డీ మధు, ఆర్‌ఎఫ్‌ఓ ఎస్‌ఎస్ సిద్దరాజు పరిశీలించారు. నియమాల ప్రకారం ఏనుగు కళేబరాన్ని వన్యజీవులకు ఆహారంగా అడవిలోనే వదిలేశారు.
అతి పెద్ద దంతాల ఆసియా
ఏనుగుగా ఖ్యాతి
మరో గజరాజుతో పోరాటంలో మృతి