రాయచూరు రూరల్ : రాయచూరులో రెండు రోజుల పాటు ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నగరంలోని మహిళా సమాజ్ నుంచి నగరంలోని వివిధ మార్గాల్లో సంచరిస్తూ ఏఐడీఎస్‌ఓ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అంతకు ముందు కర్ణాటక సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర సంచాలకుడు శశిధర్ మాట్లాడారు. దేశంలో మనమంతా ఒక్కటే అని చాటి చెప్పి కళలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు, పేద ధనికులు అనే భావాలను విడనాడాలన్నారు. కార్యక్రమంలో శరణప్ప, సరోజ, చంద్ర గిరీష్, వీరేష్, మహేష్, చెన్నబసవలున్నారు.
రాష్ట్రానికి ఎయిమ్స్
ప్రతిపాదన లేదు
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేస్తున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాధవ్ రాష్ట్రానికి ఎలాంటి ఎయిమ్స్ ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. శుక్రవారం లోక్‌సభలో దావణగెరె లోక్‌సభ సభ్యురాలు ప్రభా మల్లికార్జున్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు కాదు కదా రాష్ట్రానికే ఎయిమ్స్ కేటాయింపు విషయంలో ఎలాంటి చర్చ, ప్రతిపాదన జగరలేదని వివరించారు. న్యూఢిల్లీలో రాష్ట్ర ఎంపీలు, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతు లభించిన నేపథ్యంలో మహాత్మ గాంధీ మైదానంలో 1060 రోజుల పాటు ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయిందని ఆందోళనకారులు వాపోయారు.
విద్యా శాఖాధికారిగా ఈరణ్ణ కోస్గి
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ)గా ఈరణ్ణ కోస్గి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాయచూరు తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయచూరు డయట్‌లో అధ్యాపకుడిగా, అక్షర దాసోహ అధికారిగా విధులు నిర్వహించానన్నారు. తాలూకా స్థాయిలో పాఠశాలల అభివృద్ధికి తోడు ఉపాధ్యాయులకు సరైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానన్నారు. బాధ్యతలు చేపట్టిన ఈరణ్ణ కోస్గిని మహంతేష్, నందీష్, తాయిరాజ్, కృష్ణ, రాఘవేంద్ర, వెంకటేష్, గూళప్పలు అభినందించారు.
పుట్‌పాత్‌పై ఆక్రమణల తొలగింపు
రాయచూరు రూరల్ : నగరంలో పుట్‌పాత్‌ను ఆక్రమించి పెట్టుకున్న డబ్బా అంగళ్లు, హోటళ్లు, తోపుడుబండ్ల తొలగింపునకు సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. శనివారం కేంద్ర బస్టాండ్ నుంచి నగరసభ కార్యాలయం రోడ్డు, జైల్ రోడ్డు, ఏక్ మినార్ రోడ్డు, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమాధికారి కార్యాలయం రోడ్డులో సూపర్ మార్కెట్ వరకు రహదారికి ఇరు వైపులున్న వాటిని తొలగించారు. ఈ విషయంపై వీధివ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఏసుమిత్ర బస్టాండ్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడుతూ తమకు ప్రత్యామ్నాయ వ్యవస్థను కల్పించి తొలగించాలని అధికారులకు విన్నవించారు.
కారు, బైక్ ఢీ.. ఒకరి మృతి
హుబ్లీ: కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్ చోదకుడు అక్కడే మరణించిన ఘటన ధార్వాడ హైకోర్టు వద్ద జాతీయ రహదారిలో జరిగింది. మృతుడిని తాలూకాలోని తేగూరుకు చెందిన హనుమేష్ నాయక్(42)గా గుర్తించారు. తేగూరు గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో హనుమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అయినా చికిత్స ఫలించక మృతి చెందాడు. గరగ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఏఐడీఎస్‌ఓ కార్యకర్తల ర్యాలీ