రాయచూరు రూరల్: కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ఆర్‌డీఎస్( రాజోలి బండ డైవర్షన్ అనకట్ట) చుక్కనీరు లేక వెలవెలపోతోంది. మాన్వి తాలుకాలోని రాజోలి వద్ద నిర్మించిన ఈ ఆనకట్టలో నీరు ప్రవహించక ఏడాది అయ్యింది. 1966లో తుంగభద్ర నదికి అడ్డంగా 31 అడుగుల ఏత్తుతో 2690 మీటర్ల పొడవుతో అనకట్ట(గోడ) నిర్మించారు. నదికి లక్ష క్యూసేక్కుల నీరు వదలినప్పుడు 17 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది.
కర్ణాటకలోని మాన్వి, రాయచూరు తాలుకాల్లో 10 వేల ఏకరాలకు ఈ ఆనకట్ట ద్వారా సాగునీరు అందుతుంది. ఏపీలోని మంత్రాలయం, మాదవరం, తుంగభద్ర, తెలంగాణలోని శాంతినగర్, ఐజ ప్రజల దాహార్తి తీర్చుతోంది. అయితే ఆర్‌డీఎస్‌లో నీటి ప్రవాహం లేక ఆయకట్టు భూములు నెర్రెలు పోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోంది. ఆనకట్టలో పూడిక పేరుకుపోవడం, ఇసుక మాఫీయా తవ్వకాలు చేపట్టడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఘనంగా బీజేపీ సంస్థాపన దినం
రాయచూరురూరల్: యాదగరి, రాయచూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, జిల్లాధ్యక్షుడు వీరన గౌడ, యాదగిరిలో నగరసభ అధ్యక్షురాలు లలిత బీజేపీ జెండాలను ఆవిష్కరించారు. పండిత్ దీన్ దయాళ్, శివ ప్రసాద్ ముఖర్జి, భారత మాత చిత్ర పటాలకు పూజలు జరిపారు.
మహాత్ముడి అదర్శాలను ఆలవర్చుకోవాలి
రాయచూరు రూరల్: మహాత్ముడి అదర్శాలను విద్యార్థులు అలవర్చుకోవాలని అక్కమహదేవి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శాంత దేవి పిలుపునిచ్చారు. మహాత్ముడి ఆలోచనలు అనే అంశంపై కలబుర్గిలోని శరణేశ్వరి రేష్మ మహిళా కళాశాలలలో గాంధీ స్మారక నిధి, బెంగళూరు, యన్‌యన్‌యస్, యవజన సేవా సర్వీస్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన విచారణ సంకీర్ణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహాత్ముడి పోరాటాలు, ఆయన పాటించిన నైతిక విలువలపై విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దరామయ్య, ప్రిన్సిపాల్ గీతా, జావేద్ జాందార్, భారతి, అశోక్ కుమార, మహేష్, ఉదయ్ కుమార్, ధర్మణ్ణ, అబ్దుల్, అబిదా బేగం, శివలీల పాల్గొన్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతిపై సీఐడీ విచారణ
రాయచూరు రూరల్: నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్‌లోలో లాకప్‌డెత్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీఐడీ విచారణ చేపట్టింది. ఓ కేసులో విచారణ కోసం తీసుకువచ్చిన వీరేష్ అనే వ్యక్తి మృతి చెందగా అది లాకప్‌డెత్‌గా మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు కేసును సీఐడీకి అప్పగించారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యులనే విషయంపై ఎస్పీ పుట్టమాదవయ్యతో ఆదివారం సీఐడీ అధికారులు సమావేశమై చర్చించారు. అంతకుముందు సీఐడీ అధికారులు పోలీస్‌స్టేషన్‌లోని సీసీకెమెరాలను పరిశీలించారు.
ధరల పెంపుపై బీజేపీ నిరసన
కోలారు: ధరల పెరుగుదల, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందన్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారన్నారు. శాసన సభ సమావేశాల నుంచి 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండు చేయడం చట్టవిరుద్దమన్నారు. మైనారిటీ ఓటు బ్యాంకును భద్ర పరచుకోవడం కోసం ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 4 శాతం రిజర్వేషన్లు తీసుకు వచ్చారన్నారు. పెంచిన ధరలను తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘటనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.