బెంగళూరు : కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం రాజకీయ ముఖ్య కార్యదర్శితో పాటు పలువురిపై నమోదైన 63 కేసులను ఉపసంహరించుకోవాలనే నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో జరిగిన కేబినెట్ మీటింగ్‌లోనే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు సంఘ్ పరివార్, రైతులపై నమోదైన 63 కేసులను ఎత్తివేయాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.
రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ అందజేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం 63 కేసులును ఉపసంహరించుకుంది.వీరిలో న్యాయశాఖ మంత్రి జెసి మధుస్వామి, పర్యాటక శాఖ మంత్రి సిటీ రవి, అటవీ శాఖ మంత్రి ఆనంద్ సింగ్, వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్, సీఎం రాజకీయ ముఖ్య కార్యదర్శి, ఎంపీ రేణుకాచార్య, మైసూరు-కొడుగు ఎంపీ ప్రతాప్ సింహా, హవేరి ఎమ్మల్యే నెహ్రూ ఓలేకర్ ఇంకా తదితరులు ఉన్నారు.
దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జె.సి. మధుస్వామి స్పందిస్తూ.. 'హోంమంత్రి బసవరాజ్ కమిటీ ఇచ్చిన ఆధారాలతోనే కేసులు ఉపసంహారించారు.. ఇందులో కేవలం బీజేపీ నేతలవే కాకుండా ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీయులకు చెందిన నేతలకు సంబంధించిన కేసులను కూడా ఉపసంహరించుకుంది. బసవరాజ్ నేతృత్వంలోని సబ్ కమిటీ నివేదికతో కోర్టులకు బారం తగ్గింది' అంటూ అభిప్రాయపడ్డారు. అయితే ఈ 63 కేసుల్లో ఒకటి జె.సి మధుస్వామి పేరిట ఉండడం కొసమెరుపు.
కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్ అహ్మద్ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తప్పుబట్టారు. కేవలం తమ పార్టీకి చెందిన నేతలపై ఉన్న కేసులను కప్పిపుచ్చుకోవడానికి కేసులు ఉపసంహరణ చేసిందంటూ విమర్శించారు. ఈ నిర్ణయంతో బీజేపీ అంతరంగిక ఎజెండా ఏంటన్నది తేటతెల్లం అయిందంటూ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment