● సన్నరకం ధాన్యాన్ని అధికారులు ధ్రువీకరించాలి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
ఖమ్మం సహకారనగర్: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తిచేసినట్లుగానే రబీలోనూ చేపట్టాలని తెలిపారు. సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటుచేసి అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. ఎండల కారణంగా సిబ్బంది, రైతులకు వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్సకు ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల ఇన్‌చార్జిలకు నూతన సిమ్ కార్డులు అందించి ఎప్పటికప్పుడు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ రైతులకు 48 గంటల వ్యవధిలో నగదు జమ చేయించాలని సూచించారు. ఇక సన్న రకం ధాన్యాన్ని అధికారులు పక్కాగా ధ్రువీకరించాలని, రైస్ మిల్లుకు వెళ్లాక తాలు పేరిట కోత విధించకుండా చూడాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీసీఓ చందన్‌కుమార్, డీఎం శ్రీలత, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఏఓ డి.పుల్లయ్య, మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, జిల్లా సహకార అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయంలో వసతుల కల్పనకు కృషి
ఖమ్మంగాంధీచౌక్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ తెలిపారు. ఖమ్మంలోని కేంద్ర గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన ఆయన వాటర్ ప్లాంట్, టాయిలెట్లను పరిశీలించాక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్దులతో మాట్లాడారు. అవసరమైన పుస్తకాలు లేకపోతే జాబితా సమర్పించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, ఈ– లైబ్రరీ ఏర్పాటుచేయాలని తెలిపారు. లైబ్రరీ కార్యదర్శి అర్జున్, లైబ్రేరియన్లు కె.రవిబాబు, బి.బాబూరావు, విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.