● ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ ● నేర సమీక్ష సమావేశంలో సీపీ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: నేరం చేసిన వారెవరు శిక్ష నుంచి తప్పించుకోలేరనే రీతిలో దర్యాప్తు చేయడమే కాకుండా పకడ్బందీ ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. ఖమ్మంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన నేరసమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల పలు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా చార్జిషీట్లు దాఖలు చేసిన అధికారులను అభినందించారు. అనంతరం స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, దర్యాప్తు స్థితిగతులపై ఆరా తీశాక పలు సూచనలు చేశారు.
అక్రమాలపై నిఘా
కీలకమైన కేసుల్లో దర్యాప్తు మొదలు చార్జిషీట్ దాఖలు వరకు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధిగా విజుబుల్ పోలీసింగ్ అమలుచేస్తూ నేరాలను నియంత్రించాలన్నారు. గంజాయితో పాటు ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అలాగే, పోక్సో, అట్రాసిటీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత పాటించాలని, ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యాన బెట్టింగ్, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. అంతేకాక అన్ని స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించాలని సీపీ సూచించారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీ నరేష్‌కుమార్, ట్రెయినీ ఐపీఎస్ సాయిరుత్విక్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రెహమాన్, రఘు, వెంకటేష్, సాంబరాజు, రవి, సర్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.