ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా మరలా బాగం హేమంతరావు ఎన్నికయ్యారు. నిజామాబాద్‌లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ఆయనను రెండోసారి ఎన్నుకున్నారు. నేలకొండపల్లి మండలం ముటాపురం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన హేమంతరావు విద్యార్థి, యువజన ఉద్యమాలలో చురుకై న పాత్ర పోషించారు. విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన సుదీర్ఘ కాలం సీపీఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, జాతీయ సమితి సభ్యులుగా పనిచేస్తున్నారు. గురువారం ఆయన ఎన్నికపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పక్షాన రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. బాగంతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు దొండపాటి రమేష్, మిడికంటి వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల పలువురు అభినందనలు తెలిపారు.