
మార్కెట్.. మోడల్‌గా నిలిచేలా !
● ఖమ్మం మార్కెట్‌లో ఏడు షెడ్లు, కోల్డ్ స్టోరేజీతో మిర్చి యార్డు ● రూ.155.30 కోట్ల నిధులతో దశల వారీగా పనులు ● ఇప్పటికే మొదలైన 5, 6వ షెడ్ల నిర్మాణం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దేలా చేపట్టిన పనులు మొదలయ్యాయి. ఈమేరకు 15.39 ఎకరాల్లో మిర్చి యార్డుగా ఏడు షెడ్లు, ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలోనే రెండో పెద్దదిగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పేరుంది. విదేశాల్లో డిమాండ్ ఉన్న తేజా రకం మిర్చి కొనుగోళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. ఏటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల మేర మిర్చి లావాదేవీలు జరుగుతాయని అంచనా. తద్వారా మార్కెట్‌కు రూ.30 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. దీంతో మార్కెట్‌లోని మిర్చి యార్డులను ఆధునికీకరించాలన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో మార్కెటింగ్ శాఖ, ఆర్కిటెక్ నిపుణులు డిజైన్లు రూపొందించారు. ఈ డిజైన్ల ఆధారంగా చేపడుతున్న పనులు పూర్తయితే సీజన్‌లో 2లక్షల మిర్చి బస్తాలు వచ్చినా కింద పెట్టకుండా క్రయవిక్రయాలు పూర్తిచేసే అవకాశం ఏర్పడుతుంది.
రూ.155.30 కోట్ల నిధులతో...
మోడల్ మార్కెట్‌గా గుర్తింపు తీసుకొచ్చేలా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రూ.155.30 కోట్లతో మిర్చి యార్డు నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఈ మార్కెట్‌కు వచ్చే మిర్చి ఆధారంగా నిర్మాణాలు మొదలయ్యాయి. ఏడు షెడ్లు, ఒక కోల్డ్ స్టోరేజీతో పాటు పాలనాపరమైన కార్యకలాపాలకు అనుకూలంగా నిర్మాణాలు, రైతుల విశ్రాంతి గదులు, వ్యాపారులు, కమిషన్ వ్యాపారులు, దడవాయిలు, కార్మికుల కోసం నిర్మాణాలు ఉంటాయి.
దశల వారీగా నిర్మాణ పనులు
మిర్చి యార్డు ఆధునికీకరణ పనులు దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం మిర్చి సీజన్ కావడంతో నిత్యం 80 వేల నుంచి లక్ష బస్తాల వరకు విక్రయానికి తీసుకొస్తున్నారు. దీంతో ఒక యార్డు, కూల్చివేసిన వేర్ హౌసింగ్ గోదాంలు, జిల్లా మార్కెటింగ్ శాఖ భవనం, కార్మికుల భవనాలను తొలగించి నూతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మొత్తం ఏడు షెడ్లకు గాను ప్రస్తుతం 5, 6వ షెడ్లు, కోల్డ్ స్టోరేజీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇందులో ఐదో నంబర్ షెడ్ సింగిల్ ఫ్లోర్ కాగా, ఆరో నంబర్ రెండతస్తులతో ఉంటుంది. వీటితో పాటు పరిపాలన భవనం నిర్మాణ పనులు కూడా చేపడుతుండగా.. ఇందులోనే రైతు విశ్రాంతి భవనం, హమాలీలు, దడవాయిలు, కార్మికుల కోసం సమావేశ హాల్ ఉంటుంది.