ఆసిఫాబాద్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం, మహబూబాబాద్ తరువాత మూడో స్థానంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయ భవనాలు, జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు సీఎం సభ నిర్వహించనున్న స్థలాన్ని కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సురేశ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ పనులు పూర్తి చేసే విషయంపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 24న హెలీక్యాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని తెలిపారు. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొమురంభీం, దివంగత మంత్రి కొట్నాక భీమ్‌రావు విగ్రహాల ఆవిష్కరణ, ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సమయాభావం, సీఎం షెడ్యూల్‌కు అనుగుణంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్‌లో ప్రారంభోత్సవానికి పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో 40 శాఖలకు చెందిన కార్యాలయాలతో పాటు స్టేట్ చాంబర్, మంత్రులు, వీవీఐపీలు వచ్చినప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేక చాంబర్లు నిర్మించినట్లు చెప్పారు. కొత్త భవనంలో వసతులతో అధికారులు 20నుంచి 30శాతం వరకు అధికంగా ఏకాగ్రతతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. వందేళ్ల క్రితం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ అప్పుడు జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతోందని వివరించారు.
జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, సింగిల్‌విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ఏఎంసీ మాజీ చైర్మన్లు గాదెవేణి మల్లేశ్, చిలువేరు వెంకన్న, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, సంబంధిత శాఖల అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment