
కృష్ణా నది వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి
మేము ఈ ప్రాంతంలో 12 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. గతంలో కృష్ణానదిలో వరద వస్తుందంటే భయాందోళన చెందేవాళ్లం. ఇళ్లల్లోకి నీరు చేరేవి. దీంతో సామాన్లు సర్దుకుని కట్టపైకి చేరడం, కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసే పునరావాస శిబిరాలకు తరలి వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడే వాళ్లం. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా ఇబ్బందులు చూసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడంతో ముంపు నుంచి బయటపడ్డాం. ఇప్పుడు ఎంత వరద వచ్చినా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ధైర్యంగా ఉండగలుగుతున్నాం.
– మజ్జి సుశీల, తారకరామనగర్, రాణిగారితోట, విజయవాడ
మేము తారకరామనగర్‌లో మూడున్నర దశాబ్దాలుగా నివాసం ఉంటున్నాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు మా కష్టాలు ప్రారంభమయ్యేవి. కృష్ణానదికి వరద వస్తే సామాన్లు సర్దుకుని కట్టపైకి చేరే వాళ్లం. అలా అర్ధరాత్రి సమయంలో కూడా ఎన్నోసార్లు ఇళ్లు మునిగి, సామాన్లతో కట్టపై బిక్కు బిక్కు మంటూ గడిపాం. ముంపు సమస్యకు వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారం చూపారు.
– సీహెచ్ వెంకటరెడ్డి,
తారకరామనగర్, రాణిగారితోట
నాలుగు దశాబ్దాలుగా రణదీవెనగర్‌లో కరకట్ట దిగువన నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నాం. రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలితే మా ఇళ్లన్నీ మునిగేవి. ఇంట్లో సామాన్లు తడిసి పాడైపోయేవి. ఇప్పుడు రిటైనింగ్‌వాల్ నిర్మించడంతో వరద వచ్చింది కూడా మాకు తెలియడం లేదు. సంతోషంగా ఇళ్లలోనే ఉండగలుగుతున్నాం.
– ఎన్.రామతులసమ్మ, రణధీర్‌నగర్
విజయవాడ రాణిగారితోట వైపు నిర్మించిన వరద రక్షణ గోడ, రివర్ ఫ్రంట్ పార్క్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ వాసులకు కృష్ణానది వరద ముంపు శాశ్వతంగా తప్పింది. ప్రకాశం బ్యారేజికి దిగువన కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మంది ప్రజలకు వరద ముంపు నుంచి పూర్తి ఉపశమనం కలిగింది. గతంలో వరద వచ్చిందంటే నగరంలోని కృష్ణా కరకట్టను ఆనుకొని ఉండే ప్రాంతాల ప్రజలు వణికి పోయే వారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు అన్నీ నీట మునిగినట్టే. దీంతో ప్రజలు సామ గ్రితో సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయే వారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నీరు ఇళ్లలోకి రాకుండా దాదాపు రూ.500 కోట్లతో కరకట్ట వెంబడి రక్షణ గోడ నిర్మించారు.
దశాబ్దాలుగా ముంపు సమస్య..
నగరంలో కృష్ణా నదికి దిగువన ఉన్న పలుకాలనీలకు ముంపు సమస్య దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ఈ సమస్యపై దృష్టి సారించారు. నది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని తలంచారు. ఆయన మరణం తరువాత మళ్లీ ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2014 టీడీపీ ప్రభుత్వం వచ్చిన నిర్మాణపు పనులు చేపట్ట కుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
మాజీ ముఖ్యమంత్రి చొరవ
విజయవాడ నగరంలో 2019లో కృష్ణానదికి వచ్చిన వరదతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆ సమయంలో ఆయా ప్రాంతాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. ముంపు వాసుల కష్టాలను చూసి చలించి పోయారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు కోటినగర్ నుంచి పద్మావతి ఘాట్ వరకు రక్షణ గోడ నిర్మించారు.
గతాన్ని తలచుకొని..
గతాన్ని తలచుకొంటూ, ఇప్పుడు కృష్ణా నది పెద్ద ఎత్తున వరద వచ్చినా తమకు భయం, ఆందోళన లేదని స్థానిక వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని, జగన్‌మోహన్‌రెడ్డి రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయడంతో తమ కాలనీల రూపు రేఖలే మారిపోయాయని చెబుతున్నారు. దీనితో చెత్త, చెదారంతో అపరిశుభ్రంగా ఉండే ఈప్రాంతంలో రక్షణ గోడ నిర్మించడమే కాకుండా, పార్కు ఏర్పాటు చేయడం చాలా బాగుందంటున్నారు.
దశ పొడవు(కి.మీ) ఖర్చు
(రూ.కోట్లలో)
మొదటి 2.2 104.62
రెండో 1.2 134.43
మూడో 2.26 235.46
మొత్తం 5.66 474.51
ఆహ్లాదం పంచేలా..
నగరవాసులకు ముంపు సమస్యను తీర్చడంతో పాటు, ఆహ్లాదం పంచేందుకు వీలుగా నిర్మించిన పార్కు అందాలు నగరవాసులకు కనువిందు చేస్తున్నాయి. కనకదుర్గా వారధి నుంచి పోలీస్ కాలనీ డీపీ స్టేషన్ వరకు 1.25 కిలోమీటర్ల మేర పరిధిలో రూ.12.3కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును నిర్మించారు. ఒకే సారి 500 మంది వాకింగ్ చేసేలా వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ఈ పార్కును రక్షణగోడలతో పాటే అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ప్రస్తుతం కృష్ణా నదికి వరద వస్తున్న నేపథ్యంలో నగర వాసులు ఈ రివర్ ఫ్రంట్ పార్కు నుంచి కృష్ణమ్మ అందాలు చూసి పులకించిపోతున్నారు.
నాటి అవస్థలు ఇవి
గతంలో వరద ప్రభావానికి గురైన ప్రాంతాలు..
కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వర్ నగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదీవెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసాని నగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భూపేష్‌గుప్తానగర్, భ్రమరాంబపురం
రక్షణ గోడ నిర్మాణం ఇలా..
వరద ముంపు నుంచి ఉపశమనం
80 వేల మందికి
రిటైనింగ్ వాల్ వెంబడి నిర్మించిన పార్కుకోసం వెచ్చించిన సొమ్ము రూ.12.3కోట్లు
కృష్ణా నదికి వరదొస్తుంటే ఆ ప్రాంతం వారికి గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి.. ఏ క్షణం ఏమవుతుందో.. ఎక్కడ తమ ఇళ్లు ముంపునకు గురవుతాయోనని.. ముందే తట్టాబుట్టా సర్దుకోవ్సాలిన పరిస్థితి ఉండేది. వరద కొనసాగినన్ని రోజులు వారంతా బిక్కు బిక్కు మంటూ పునరావాస కేంద్రాల్లో బతకాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్మించిన రక్షణ గోడ వల్ల వారికి శాశ్వతంగా ఆ సమస్య నుంచి పరిష్కారం లభించింది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా తీసుకుని
రిటైనింగ్ వాల్ నిర్మాణం
రూ.370 కోట్లతో గోడల
నిర్మాణం పూర్తి
12 లక్షల క్యూసెక్కుల వరద
వచ్చినా దిగులు లేదు
గతంలో వరద వస్తే వణుకే
ప్రస్తుతం కృష్ణా నదికి వరద
వచ్చినా నిశ్చింతగా ఉన్న నగరవాసులు
కోటినగర్ నుంచి యనమలకుదురు మధ్య 2.2 కిలో మీటర్ల పొడవున మొదటి దశలో రక్షణ గోడ నిర్మించారు.
రెండో దశలో కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్ వరకు, మూడో దశలో పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గా వారధి మధ్య కష్ణానది వెంబడి రక్షణ గోడ నిర్మించారు.
2009 అక్టోబర్ 5వ తేదీన అత్యధికంగా 11.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 2019–2021 మధ్యలో 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.
ఈ వరదలను దృష్టిలో ఉంచుకొని 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపును తట్టుకునేలా, నదీ తీర ప్రాంత ప్రజలకు రక్షణ కలిగే విధంగా ఈ రక్షణ గోడను నిర్మించారు.

కృష్ణా నది వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి

కృష్ణా నది వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి

కృష్ణా నది వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి

కృష్ణా నది వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి
Comments
Please login to add a commentAdd a comment