మచిలీపట్నంఅర్బన్: జిల్లాలోని బ్లడ్ బ్యాంక్‌లలో రక్త నిల్వల కొరతపై డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎస్.శర్మిష్ట బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘రక్త నిల్వల కొరత’ శీర్షికతో ఈ నెల 24వ తేదీ సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రక్తనిల్వలు తగ్గాయని, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల ఏర్పాటులో ప్రభుత్వ, ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి రక్తదాన శిబిరంలో 100కు తగ్గకుండా బ్లడ్ యూనిట్లు సేకరణ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల పనితీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం సాకులు చెబుతూ స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించకుంటే బ్లడ్ బ్యాంక్ లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. ప్రతి రోజూ బ్లడ్ బ్యాంకులు ఈ–రక్తఖోష్ యాప్‌లో స్టాక్ అప్డేట్ చేయాలన్నారు. ప్రతి నెల 5 వ తేదీ లోగా నెలవారీ రిపోర్ట్ పంపించాలని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో ప్లాస్మా వినియోగంలో అక్రమాలు తమ దృష్టికి వచ్చాయని, అలాంటి సంఘటనలు పునరావృతం అయితే బ్లడ్ బ్యాంకులు, డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎల్‌ఎటీఓ అంబటి వెంకట్రావు, సీపీఎం ఎల్.మధుసూదనరావు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్లు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రక్త నిల్వల కొరతపై డీఎంహెచ్‌వో హెచ్చరిక