
వేడెక్కిన రాజకీయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య అక్రమార్జన విషయంలో ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ అంశం టీడీపీ అధిష్టానానికి తల నొప్పిగా మారింది. తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధికి మధ్య అక్రమార్జనలో ఏర్పడిన వివాదం అక్కడ పార్టీలో గ్రూపు రాజకీయాలకు బీజం వేసింది. ప్రతి పనిలో కమీషన్లకు పాకులాడుతూ తనంత నిజాయతీపరుడైన రాజకీయ నాయకుడు మరెవరూ లేరంటూ నిత్యం మీడియాలో పబ్లిసిటీ కోరుకునే ప్రజాప్రతినిధి ఒకరు. సైలెంట్‌గా తాను చేసే అవినీతి తన నీడకు కూడా తెలియనీయకుండా ప్రతి నియోజకవర్గం నుంచి వాటా రావాలని ఆదేశాలిచ్చే నేత మరొకరు.
వికృత క్రీడలో నేతలు
బలిపశువులు
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్లమెంటు ప్రజాప్రతినిధి, నియోజక వర్గ ప్రజాప్రతినిధి ఇద్దరూ కలిసి ఆడుతున్న రాజకీయ వికృత క్రీడలో సొంతపార్టీ నేతలు బలి పశువులు అవుతున్నారని తెలుస్తోంది. ఇద్దరు నేతలూ అక్రమార్జనే ధ్యేయంగా రూ.కోట్ల ప్రజా ధనాన్ని వెనకేసుకొని వాటాల వద్ద తేడాలు రావడంతో ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ రాజకీయ రచ్చ స్థానికులు, అధికారులకు తలనొప్పిగా మారింది.
మట్టి దందాలో తలెత్తిన వివాదం
తిరువూరు నియోజకవర్గంలో ఎ.కొండూరు మండలం గోపాలపురం, విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇద్దరు నేతల కనుసన్నల్లో మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రోజూ వందల లారీల గ్రావెల్‌ను తెలంగాణకు తరలించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇద్దరు నేతలూ కొంతకాలం మట్టి దందాను కొనసాగించారు.
అధికారులు సతమతం
ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో అధికారులు సతమతమవుతున్నారు. ఇద్దరి నాయకుల తీరుతో అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులే వర్గాలుగా ఏర్పడి బహిరంగ సవాళ్లు చేసుకోవడంతో పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
టీడీపీలో పార్లమెంట్, తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ప్రజాప్రతినిధుల మధ్య వికృత రాజకీయ క్రీడ గోపాలపురం మట్టి దోపిడీలో ముదిరిపాకాన పడ్డ విభేదాలు గ్రూపు రాజకీయాలతో కుంటుపడుతున్న అభివృద్ధి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై వేటుకు రంగం సిద్ధం!
చర్యలకు రంగం సిద్ధం
పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ తిరువూరు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి మరొక ఇన్‌చార్జిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని అణగదొక్కేందుకు నియోజకవర్గంలోని అగ్ర కులాల నేతలందరినీ గ్రూపుగా తయారుచేసి పార్లమెంటు ప్రజాప్రతినిధి అధిష్టానానికి తప్పుడు సమాచారం చేరవేస్తున్నాడని, అసమ్మతి నేతల వెనుకుండి కఽథ నడిపిస్తున్నారని నియోజక వర్గ ప్రజాప్రతినిధి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రమేయం ఏమీలేదని పార్లమెంటు ప్రజా ప్రతినిధి వర్గం ఆరోపిస్తోంది. తిరువూరు టీడీపీలోని ఈ వివాదం ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
ఎంపీ వర్గంలో ఎ.కొండూరు మండలానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ దళిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోపోతే తాను రాజీనామా చేస్తానంటూ ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఇదంతా ఎమ్మెల్యే నాటకమని ఏఎంసీ మాజీ చైర్మన్ మీడియా సాక్షిగా ప్రకటించారు. తాను ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకి రూ. 50 లక్షలు ఇచ్చానని, మళ్లీ రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రవర్తన ఘటనపై అధిష్టానం చర్యలు తీసుకోకుండా పార్లమెంటు ప్రజా ప్రతినిధి పీఏకి ముడుపులు ఇచ్చినట్లు తన విచారణలో తేలిందని నియోజక వర్గ ప్రజాప్రతినిధి ఆరోపించారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో, ప్రైవేటు కట్టడాల్లో, రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారంలో, అక్రమ రేషన్ దందాలో ఎమ్మెల్యే కమీషన్‌లు దండుకుంటున్నాడని పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గం బహిరంగంగానే విమర్శిస్తోంది.

వేడెక్కిన రాజకీయం

వేడెక్కిన రాజకీయం

వేడెక్కిన రాజకీయం

వేడెక్కిన రాజకీయం