
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు పూరిళ్లు దగ్ధం
మోపిదేవి: మోపిదేవి నుంచి అవనిగడ్డ వెళ్లే మార్గంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో శనివారం నాలుగు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వివరాల్లోకి వెళ్లితే మోపిదేవి నుంచి అవనిగడ్డ వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన నివాసం ఉంటున్న పేదలకు చెందిన పూరిళ్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు రేగాయి. ఇళ్లలో గ్యాస్ బండలు కూడా ఉండటంతో చుట్టు పక్కలవారు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది హుటాహూటిన ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ, గ్రామ ఉప సర్పంచ్ కోనేరు సుందరసింగ్, మాజీ గ్రామ సర్పంచ్ రావ నాగేశ్వరరావు స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సహకరించారు. ఈ ప్రమాదంలో రాజులపాటి రాజేశ్వరమ్మ, సింగోతు రంగారావు, పెండ్ర ముసలి, మోర్ల సీతారావమ్మ పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. సుమారు రూ.3.80 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు.