వామ్మో.. చిరుత
నల్లమల పల్లెవాసులను భయపెడుతున్న చిరుతలు
నెల రోజుల వ్యవధిలో నలుగురిపై దాడి
తాజాగా పచ్చర్లలో ఓ మహిళ చిరుతకు బలి
మహానంది: చిరుత పేరు వినిపిస్తే చాలు నల్లమల అటవీ పరిసర గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో ఏదైనా అరుపులు వినిపిస్తే చాలు తెల్లవార్లు జాగారమే చేయాల్సి వస్తుంది. నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్‌బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే.
అనంతరం గిద్దలూరు మార్గంలోని అటవీ చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న ఓ ఉద్యోగిపై దాడి చేసి గాయపరిచింది. రైల్వే పనులకు వచ్చిన ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన పాండవ అనే బాలికపై దాడి చేయగా తలకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. శిరివెళ్ల మండల పరిధిలోని నల్లమలలో ఉన్న పచ్చర్ల గ్రామానికి చెందిన షేక్ బీబీ వారం రోజుల క్రితం నిద్రిస్తుండగా చిరుతపులి దాడి చేసి గాయపరిచింది. తాజాగా మంగళవారం అదే గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మోహరున్నీసా కట్టెపుల్లల కోసం వెళ్లగా దాడి చేసి తలను తినేసింది. ఇదిలా ఉండగా పచ్చర్ల సమీపంలోని చిరుతపులిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలతో పాటు బోను ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
మహానందిలో భయం...భయం..
మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లో వారం రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. దేవస్థానానికి చెందిన గోశాల, అన్నప్రసాద వితరణ కేంద్రం, పాత వివేకానంద పాఠశాల ప్రాంగణాల్లో చిరుతపులి సంచరిస్తుంది. దీంతో స్థానికులతో పాటు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వరుస దాడి ఘటనలు జరుగుతున్నా అటవీశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. అటవీశాఖ అధికారులు స్పందించి మహానంది, పచ్చర్ల గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించి సుదూర ప్రాంతాలకు తరలించాలని నల్లమల పరిసర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment