దేవర పొట్టేళ్ల కోసం వెళ్తూ మృత్యువాత
కృష్ణగిరి: గ్రామంలో దేవర కోసం పొట్టేళ్లను తీసుకొచ్చేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. మండలంలోని టి.గోకులపాడులో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు గ్రామదేవతల దేవర నిర్వహించనున్నారు. దేవరలో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పొట్టేళ్ల కోసం గ్రామానికి చెందిన 20 మంది రెండు ఆటోల్లో శనివారం ఉదయం తెలంగాణలోని పెబ్బేరు సంతకు బయలుదేరారు. అలంపూర్ దాటిన తరువాత కోదండాపురం వద్ద వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ ఓ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న పది మందిలో పింజరి నబీసాహెబ్ (53) అక్కడిక్కడే మృతి చెందాడు. మిగతావారిలో నాగరాజు, లాల్‌స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురికి రక్తగాయాలు కావడంతో వెంటనే 108లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామి రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య మస్తానమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తెలంగాణలోని కోదండాపురం వద్ద ఆటోను వెనక నుంచి ఢీకొట్టిన పాల ట్యాంకర్
ఒకరి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
టి.గోకులపాడులో విషాదచాయలు
దేవర పొట్టేళ్ల కోసం వెళ్తూ మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment