దాన ధర్మం..పుణ్యఫలం!
● రంజాన్ మాసం ప్రత్యేకం
● జకాత్, పిత్రాకు అత్యధిక ప్రాధాన్యత
● ఒక రూపాయి దానం చేస్తే
70 రెట్లు ఫలితం
గడివేముల: ముస్లింలకు అత్యంత ప్రీతికరమైనది రంజాన్ మాసం. జీవితాన్ని, జీవిత గమనాన్ని మార్చి మనసుకు ప్రశాంతత ఇచ్చే ఈ మాసంలో ఇస్లామియ బోధనల ప్రకారం నడుచుకుంటారు. దీనివల్ల మిగతా 11 నెలలు కూడా అదే విధంగా జీవించేలా అలవాటు అవుతుందని ముస్లింల నమ్మకం. ఇదే కాకుండా ఆరాధన విషయంలో ఇస్లాం నిర్వచనం విభిన్నమైంది. విధిగా చేయాల్సిన సమాజ్, రోజా, జకాత్, హజ్ వంటి ఆరాధనలే కాదు. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఖురాన్ ఆదేశాల ప్రకారం చేసిన ప్రతి మంచి పని ఆరాధన కిందికే వస్తుంది. అందుకే రంజాన్ మాసంలో చేసే ఏ పనులకై నా 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని ముస్లింల నమ్మకం. ఒక రూపాయి దానం చేస్తే రూ.70 దానం చేసినంత పుణ్యం లభిస్తుందని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ మాసంలో అందరూ దానం చేస్తారు.
దానధర్మాలు రెండు రకాలు
సమాజంలో నిర్భాగ్యులు, అనాథలను ఆదుకోవడానికి దానం చేయాలని ఇస్లాం బోధిస్తుంది. అందుకే ముస్లింలు రంజాన్ మాసంలో ఇతోధికంగా దాన ధర్మాలు చేస్తుంటారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. ఇస్లాంలో దానధర్మాలు రెండు రకాలు ఒకటి తప్పనిసరిగా చేయవలసినది జకాత్. అంటే తన వద్ద ఉన్న సంపదలో 2.5 శాతం పేదలకు పంచాలి. ఇలా చేయడం ద్వారా సంపద శుద్ధి అవుతుందని నమ్మకం. రెండోది ఫిత్రా. రంజాన్ మాసం తర్వాత రోజు ఈద్ నమాజ్ కన్నా ముందు ఫిత్రా తప్పనిసరిగా చెల్లించాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరి పేరిట ఫిత్రా దానం తప్పనిసరిగా చేయాలి. రెండు కిలోల 50 గ్రాముల ధాన్యం లేదా గోధువులు లేదా వాటి మార్కెట్లో వాటి ధరకు సరిపడ సొమ్మునైనా పేదలకు దానంగా చేయాలి. పేదలు కూడా ధనికులతో సమానంగా పండుగ చేసుకోవాలన్నది ఈ సాయం ఉద్దేశం.
అల్లా ప్రసాదించిన మాసం
మానవుల అధికంగా పుణ్యం చేకూర్చేందుకే అల్లా ప్రసాదించిన నెల రంజాన్. ఈ మాసంలో ఆధ్యాత్మికతలో గడపాలి. నిరుపేదలకు ఫిత్రా, జకాత్ చేయాలి. నిష్టతో ఉప వాసం ఉండాలి. ప్రతి ముస్లిం జకాత్ తప్పనిసరిగా ఇవ్వాలి. పేదలు కూడా ధనికులతో సమానంగా పండుగా చేసుకునేలా చూడాలి. సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలి. అప్పుడే అల్లా కరుణిస్తాడు. ఈ మాసంలో చిన్న దానం చేసినా పుణ్యం లభిస్తుంది.
–ఖాజీ మౌలానా షేక్ అబ్దుల్ రెహమాన్ రషాది, ప్రభుత్వఖాజీ, గడివేముల మండలం
దానం చేస్తే రెట్టింపు పుణ్యం
రమదాన్ మాసంలో రూ.1 దానం చేస్తే రూ.70 దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రతి ముస్లిం జకాత్ తప్పనిసరిగా ఇవ్వాలి. తను ఉన్న ఇల్లు కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే సంపదలో 2.5 శాతం జకాత్‌గా చెల్లించాలి. ఇది అల్లా ఆదేశం. రంజాన్ మాసంలో రోజా ఉండటం ఎంత ముఖ్యమో పేదలకు సాయం చేయడం కూడా అంతే ముఖ్యం.
–హఫీజ్ జాఫర్ ఉశేన్,మంచాలకట్ట.
దాన ధర్మం..పుణ్యఫలం!
దాన ధర్మం..పుణ్యఫలం!
Comments
Please login to add a commentAdd a comment