ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
కర్నూలు: ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసి గౌరవప్రదమైన జీవితం గడపాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. మంగళవారం కర్నూలు శివారులోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళా కారాగారాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఖైదీలకు అందించే ఆహారం, రేషన్‌తో పాటు ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే కర్నూలు న్యాయ సేవాధికార సంస్థను, లేదంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనప్పటికీ జామీనుదారులు లేక జైలులోనే ఉంటున్నామని జిల్లా జడ్జి దృష్టికి తీసుకురాగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వైభవంగా సుయతీంద్రతీర్థుల పూర్వారాధన
మంత్రాలయం: నవ మంత్రాలయ శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు పూర్వారాధన వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మంగళవారం వేకువ జామున సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పీఠాధిపతి గురువులైన సుయతీంద్రతీర్థుల వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ముందుగా స్వామిజీ మూల బృందావనానికి నిర్మల్య విసర్జన గావించి పుష్ప, పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేక పూలతో విశేష అలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా యాగ మంటపంలో సుయతీంద్రతీర్థుల ప్రశస్థితి భక్తులకు ప్రవచించారు.
పత్తికొండ కళాశాలకు ఏ గ్రేడు
పత్తికొండ రూరల్: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడు వచ్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మాధురి తెలిపారు. పాణ్యం డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎం.ఫరీదా బేగం, డోన్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ అకడమిక్ ఆడిట్‌లో భాగంగా మంగళవారం కళాశాలను పరిశీలించారన్నారు. అకడమిక్ రిజిస్టర్లు, తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల మైదానంలో స్పోర్ట్స్, విద్యార్థులకు తాగునీటి సదుపాయం వంటి వాటిని పరిశీలించి సంతృప్తి చెందినట్లు తెలిపారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
Comments
Please login to add a commentAdd a comment