ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలకు నష్టమే
కర్నూలు(అర్బన్): రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికల ఆధారంగా ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్, రాష్ట్ర యూనిట్‌గా చేసినా.. రాష్ట్రంలోని మాల మాదిగలకు నష్టం జరుగుతుందని ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్‌సీహెచ్ బజారన్నతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్‌గా విద్యా, ఉద్యోగాల్లో మూడు కేటగిరీలుగా వాటాలు చేస్తామని ప్రకటించిందన్నారు. అయితే ఏకసభ్య కమిషన్ వర్గీకరణను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అమలు చేసేందుకు రాష్ట్రం యూనిట్‌గా చేయనున్నట్లు ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏ కేటగిరీలోని రెల్లి, ఉపకులాలకు 1 శాతం, బీ కేటగిరీలోని మాదిగ, ఉపకులాలకు 6.50 శాతం, సీ కేటగిరిలోని మాల, ఉపకులాలకు 7.50 శాతం రిజర్వేషన్ ప్రతిపాదిస్తు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించిందన్నారు. ఏ విధంగా వర్గీకరణ చేపట్టినా రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాలలకు, వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాదిగలకు నష్టం జరుగుతుందన్నారు. జిల్లా యూనిట్‌గా అమలు చేసినా ఎస్సీ జాబితాలోని 59 ఉప కులాలు భారీగా విద్య, ఉద్యోగాలను కోల్పోతారన్నారు. ఈ అంశంపై ఈ నెల 20న అసెంబ్లీలో చర్చ జరిగిన అనంతరం రాయలసీమలోని మేధావులను కలిసి ఎస్సీలకు ఎలాంటి నష్టం జరగకుండా నేషనల్ ఎస్సీ కమిషన్‌ను కలిసి వివరించనున్నట్లు తెలిపారు.
ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment