
న్యాయవాదిగా రిటైర్డు ఉపాధ్యాయుడు
పత్తికొండ రూరల్: వృద్ధాప్యం బద్దకానికే గానీ మన ప్రయత్నానికి కాదని రిటైర్డు టీచర్ నిరూపించారు. గురువుగా పదవీ విరమణ పొంది 74 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిని స్వీకరించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. పత్తికొండలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదిగా సోమవారం రిటైర్డు టీచర్ బోయ వీరస్వామి 74 ఏళ్ల వయసులో సభ్యత్వం తీసుకున్నారు. ఈయన 1984లో ఉపాధ్యాయుడుగా పత్తికొండ మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామంలో విధుల్లో చేరి మళ్లీ అదే గ్రామంలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా 2009లో పదవీ విరమణ పొందారు. ఆ తరువాత న్యాయవాద వృత్తిని స్వీకరించాలని 2014–17లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. హైకోర్టులో ఎన్‌రోల్‌మెంట్ చేసుకుని స్థానిక కోర్టులోని బార్ అసోసియేషన్‌లో నూతన అధ్యక్షుడు మధుబాబు చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు. రిటైర్డు టీచర్ న్యాయవాద వృత్తిలోకి రావడం పత్తికొండ కోర్టులో ఇదే తొలిసారి అని సీనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
పత్తికొండ కోర్టులో తొలిసారి సభ్యత్వం