
12న వీర హనుమాన్ విజయ శోభాయాత్ర
కర్నూలు కల్చరల్: విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఈనెల 12న వీర హనుమాన్ విజయ శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి తెలిపారు. బుధవారం వినాయక్ ఘాట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలోపాసన దివస్‌ను పురస్కరించుకొని హిందు బంధువులను సంఘటితం చేయడానికి వీర హనుమాన్ శోభాయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఓల్డ్ సిటీలోని లలితాపీఠం వద్ద శోభాయాత్ర ప్రారంభమై స్వామి వివేకానంద కూడలి (రాజ్‌విహార్ సర్కిల్), శ్రీకృష్ణ దేవరాలయ సర్కిల్ మీదుగా బుధవార పేట సాయి సీతారామంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అమరసింహా రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు మాట్లాడారు.
11న జ్యోతిబా పూలే జయంతి
కర్నూలు(అర్బన్): మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను ఈ నెల 11న ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు బిర్లాగేట్ సర్కిల్‌లో ఉన్న జ్యోతిబా ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడే జయంతి సభ నిర్వహిస్తామన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, కుల సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పేర్కొన్నారు.