వనపర్తిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి
మహబుబ్‌నగర్: బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ని జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో.. అదే ఊపులో గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటతో పాటు వనపర్తి జిల్లాకేంద్రంలో భారీ బహిరంగసభలు తలపెట్టింది. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ నిర్వహించే రెండో భారీ ప్రచార సభలు ఇవే కావడం గమనార్హం.
అచ్చంపేటలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కేంద్రంగా ఎన్నికల ప్రచారసభలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటల జరిగే సభ కోసం ఎనిమిది ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా అచ్చంపేటకు హెలీకాప్టర్‌లో చేరుకుని ప్రసంగిస్తారు. అనంతరం వనపర్తి లో జరిగే సభలో పాల్గొంటారు.
అయితే 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో గువ్వల బాలరాజు విజయం కోసం కేసీఆర్ బహిరంగసభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల క్రీడామైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీకాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రానికి చేరుకుంటారు. 2018 ఎన్నికల్లోనూ.. ఇదే మైదానంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.
భారీ జనసమీకరణకు ఏర్పాట్లు..
సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద బహిరంగ కోసం భారీగా జనాన్ని సమీకరించేందుకు బీఆర్‌ఎస్ వర్గాలు కృషిచేస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే గువ్వల బాలరాజు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. అచ్చంపేట ము న్సిపల్ పరిధిలోనే ఎ క్కువ మందిని సమీకరించాలని భావిస్తున్నారు.
అలాగే అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర, వంగూరు, చారకొండ మండలాల నుంచి జనాన్ని సమీకరించి సభను విజయవంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 2018 నాటి ఎన్నికల ప్రచార సభలా కాకుండా వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగ కుండా కొత్త స్థలాన్ని ఎంపిక చేశారు. నాలుగు చోట్ల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. వంద మంది వీఐపీలు కూర్చునేందుకు వీలుగా స్టేజీ నిర్మించారు.
వనపర్తి నియోజకవర్గంలోని 130 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. సుమారుగా 50– 60 వేల మందిని సీఎం ప్రజా ఆశీర్వాద సభలో కూర్చొని ప్రసంగాన్ని వినేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. గిరిజన తండాలు, గ్రామాలు, మున్సిపాలిటీల వార్డుల నుంచి సభకు ప్రజలను తరలిస్తున్నట్లు చెప్పారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సీఎం ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. ఎస్పీ రక్షితా కె. మూర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని సూచించారు.
అచ్చంపేటలో సీఎం సభకు ఎస్పీతో పాటు నలుగురు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 16 మంది సీఐలతోపాటు రిజర్వు సీఐలు, 22 మంది ఎస్‌ఐలు, 312 మంది ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పరిశీలించారు.
అంతా గులాబీమయం
సీఎం కేసీఆర్ పాల్గొనే సభ కోసం అచ్చంపేట పట్టణాన్ని గులాబీ జెండాలతో అలంకరించారు. అచ్చంపేట–నాగర్‌కర్నూల్, అచ్చంపేట– లింగాల రోడ్డు, అచ్చంపేట– ఉప్పునుంతల రోడ్డు, అచ్చంపేట– శ్రీశైలం మార్గాల్లో రోడ్డుకు ఇరువైపులా భారీఎత్తున కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అచ్చంపేట అంతా గులాబీ జెండాలతో నిండిపోయింది.
వనపర్తి మున్సిపాలిటీలోని అన్ని ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లలో గులాబీ జెండాలు, గులాబీ తోరణాలు కట్టడంతో వనపర్తి గులాబీమయంగా మారిపోయింది. జిల్లాకేంద్రానికి చేరుకునే అన్ని రహదారులు జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment