సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి పాలమూరులో పునర్ వైభవాన్ని చాటేందుకు పక్కాప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ప్రధానంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఇదివరకే నజర్ వేసిన ఆ పార్టీ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టొద్దనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు బహిష్కరణ తర్వాత సంప్రదింపులకు శ్రీకారం చుట్టి.. ఆయనను సొంత గూటికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు.
అదేవిధంగా బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ అసమ్మతులు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి తదితరులు సైతం చేయి అందుకోనున్నారు. ప్రధానంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో జూపల్లితో మొదలైన చేరికల పరంపర నడిగడ్డగా పేరొందిన జోగుళాంబ గద్వాల జిల్లాకు పాకింది.
♦ అసమ్మతి నేతలతో మాటాముచ్చట..
కాంగ్రెస్‌లోకి బడా నేతల చేరిక నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పొసగకపోవడంతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరితాతిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోదరుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి సైతం హస్తం గూటికి చేరనున్నారు. రేవంత్‌రెడ్డితో ఆయనకు పాత పరిచయం ఉంది. దీంతో రేవంత్‌రెడ్డి.. చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సరితాతిరుపతయ్యతో కలిసి అసమ్మతి నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు.
ఈ మేరకు సరిత, చంద్రశేఖర్ వేర్వేరుగా రోజుకో మండలం చొప్పున పర్యటిస్తున్నారు. అసమ్మతి నేతలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరేలా సన్నాహాలు ముమ్మరం చేశారు. మరోవైపు గద్వాల, ధరూర్, మల్దకల్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లోని బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలతో రేవంత్‌రెడ్డి సైతం స్వయంగా ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అలంపూర్ నియోజకవర్గంలో సైతం చాపకింద నీరులా కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వినికిడి. సరితాతిరుపతయ్యతో కలిసి ఓ జెడ్పీటీసీ సభ్యుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది.
తెరపైకి బీసీ ఫార్ములా..
మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో గద్వాలలో బీసీ ఫార్ములా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సైతం ఇదే నినాదంతో ముందుకెళ్లాలనే యోచనలో ఉంది. కాంగ్రెస్‌లో చేరుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ సరితాతిరుపతయ్య కురువ సామాజికవర్గానికి చెందినవారు కాగా.. గద్వాల, అలంపూర్‌లో ఈ వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో వీరి రాకతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని పార్టీ అధిష్టానం చెబుతున్నప్పటికీ.. సరితాతిరుపతయ్యకే ఖరారైనట్లు గద్వాల నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
మరోవైపు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. కాంగ్రెస్‌లో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈయన కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు నాయకులు కాంగ్రెస్‌లో చేరాలని యోచిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను బేరీజు వేసుకుంటున్న వారు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయి తే పోటీ లేకుండా బీసీ వర్గానికి చెందిన ఒకరు ఎన్నికల్లో నిలబడితే గెలిచే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment