సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఢిల్లీలో కలవడం ఇందుకు బలం చేకూర్చింది. మన్నె జీవన్‌రెడ్డి ప్రస్తుత మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి స్వయానా సోదరుడి కుమారుడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జడ్చర్ల బీఆర్‌ఎస్ టికెట్ తనకే వస్తుందని చివరి దాక చెబుతూ వచ్చిన ఆయన టికెట్ రాకపోవడంతో మిన్నంకుండిపోయారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మళ్లీ మన్నె జీవన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర వస్తున్న సమయంలో కాంగ్రెస్‌లో చేరి పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే సొంత బాబాయ్ ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో అబ్బాయ్ మన్నె జీవన్‌రెడ్డి తలపడే పరిస్థితి ఉంటుంది. ఇదే జరిగితే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు రసవత్తరం కానుంది. ఒకవేళ బీఆర్‌ఎస్ అభ్యర్థిని మారిస్తే కాంగ్రెస్ నుంచి కూడా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి రావొచ్చు. అభ్యర్థుల ఖరారు తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణలు మరింత మారే అవకాశాలు ఉన్నాయి.
టీటీడీ బోర్డు సభ్యుడిగా సేవలు
జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన మన్నె జీవన్‌రెడ్డికి ఎంఎస్‌ఎన్ ఫార్మా పరిశ్రమ అధినేతగా, టీటీడీ బోర్డు సభ్యులుగా మంచి గుర్తింపు ఉంది. రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాల్లో ఆయన ముందున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పట్ల మన్నె జీవన్‌రెడ్డి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చేరికకు సర్వం సిద్ధం
కాంగ్రెస్‌లో చేరేందుకు మన్నె జీవన్‌రెడ్డి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ నెలాఖరులో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముహూర్థం కూడా ఖరారు అయ్యింది. అయితే ఇందుకు వేదిక హైదరాబాదా.. ఢిల్లీనా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే ముఖ్య నేతలను కలిసి ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బీఆర్‌ఎస్‌కు దెబ్బ
మన్నె జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో బీఆర్‌ఎస్‌కు కొంత మేరకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జడ్చర్ల నియోజకవర్గంలో ఆ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటి నుంచి మన్నె జీవన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉన్న అనుచర గణం సైతం కాంగ్రెస్ వైపు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ సీటుపైనే..
కాంగ్రెస్‌లో చేరుతున్న మన్నె జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసమే మొగ్గు చూపుతున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటికే వంశీచంద్‌రెడ్డి పేరు ఖరారు దిశలో ఉన్న నేపథ్యంలో తాను ఎమ్మెల్సీ పదవిని కోరాలని నిర్ణయించకున్నట్లు మన్నె జీవన్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment