తిరుమల్‌రావు, ప్రత్యూష (ఫైల్)
మహబూబ్‌నగర్: మండలంలోని దుప్పల్లిలో తండ్రి, కూతురి మరణం తీవ్ర విషాదం నింపింది. సకాలంలో సరైన వైద్యం చేయించుకోలేక 24గంటల వ్యవధిలో ఇరువురు మృతి చెందడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. దుప్పల్లి ఎస్సీకాలనీకి చెందిన తిరుమల్‌రావు (50) పూరి గుడిసెలో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవనం సాగించేవాడు.
కొంతకాలంగా అతడు అనారోగ్యానికి గురికావడంతో భార్య కుర్మమ్మ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో పెద్ద కూతురు ప్రత్యూషను పక్కింట్లో నివాసముండే బాలరాజుకు ఇచ్చి వివాహం చేశారు. కొన్ని రోజులుగా తిరుమల్‌రావు తీవ్ర అనారోగ్యానికి గురికావడం.. ఆర్థిక సమస్యలతో సరైన వైద్యం చేయించుకోక ఇంట్లో మంచానికే పరిమితమై శుక్రవారం మృతి చెందాడు.
కాన్పు నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి కూతురు..
తిరుమల్‌రావు కూతురు ప్రత్యూష (20) కాన్పు నిమిత్తం ఈనెల 3న వనపర్తి ఎంసీహెచ్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు సాధారణ కాన్పు కాకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారు. కూతురు జన్మించింది. మరుసటి రోజు ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి క్షీణించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆమెను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
అక్కడ పరిస్థితి అనుకూలించకపోవడంతో అదే రోజు రాత్రి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. రెండు రోజులపాటు చికిత్స పొందిన ప్రత్యూష.. శనివారం తెల్లవారుజామున మరణించింది. ఒకే ఇంట్లో తండ్రి, కూతురు మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోధనలు అందరినీ కలిచివేశాయి. ఆర్థిక సమస్యలు లేకుంటే ఇద్దరు బతికేవాళ్లని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment