దీర్ఘకాలిక సెలవులోఏఎంసీ పవన్‌కుమార్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఏఎంసీ (అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్) పవన్‌కుమార్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. వాస్తవానికి ఈయన పదోన్నతిపై 2023 అక్టోబర్ 12న మహబూబ్‌నగర్‌కు వచ్చారు. గతేడాది సెప్టెంబర్ 31న డిప్యూటేషన్‌పై వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా తిరిగి వెళ్లారు. అప్పటి నుంచి ఇక్కడ ఈ పోస్టు ఖాళీగానే ఉంది. తాజాగా అక్కడికి రెగ్యులర్ కమిషనర్‌గా సైదులు రావడంతో ఏఎంసీ వెనక్కి రావాల్సి వచ్చింది. మహబూబ్‌నగర్‌లో పని చేయడానికి పవన్‌కుమార్ సుముఖంగా లేరు. ఇక్కడి కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి వ్యవహార శైలితో పొసగని పరిస్థితులు నెలకొన్నా యి. దీంతో ఏఎంసీ ఇక్కడ చేరకుండానే నేరు గా 2నెలల పాటు సెలవులో వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్ ఇంజినీర్ యు.బస్వరాజ్ సైతం త్వరలోనే వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లనున్నట్లు సమాచారం.
వాహనాలు తనిఖీలు చేసిన ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖలో పని చేస్తున్న అన్ని రకాల వాహనాలను శుక్రవారం ఎస్పీ డి.జానకి తనిఖీలు నిర్వహించారు. అన్ని రకాల విభాగాలకు సంబంధించిన వాహనాలను పరిశీలించి, వాటి ఫిట్‌నెస్ ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో హీరో షోరూం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత సర్వీస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, సురేష్‌కుమార్, ఎంటీఓ నగేష్, ఆర్‌ఐ కృష్ణయ్య, హీరో సర్వీస్ మేనేజర్ ఖలీల్ పాల్గొన్నారు.
3న ఫిజియోథెరపీ కళాశాల ప్రారంభం
పాలమూరు: ఇటీవల నూతనంగా రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళసభ ఫిజియోథెరపీ కళాశాలను ఈనెల 3న ప్రారంభం చేస్తున్నట్లు డీడీఎంఎస్ ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మీసుందరి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఫిజియోథెరపీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో 2022–23 అడాడమిక్ సంవత్సరంలో ఫిజియోథెరపీ కళాశాలను నూతనంగా ప్రారంభం చేశామని, ప్రస్తుతం 150 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మూడో బ్యాచ్ విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని, మొదటి బ్యాచ్‌లో 83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రాబోయో రోజుల్లో వసతి గృహం సైతం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 80 ఏళ్ల నుంచి ఈ సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ నెల 3న నిర్వహించే ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, వైస్ ప్రిన్సిపాల్ కార్తీక్, ఛాయ నందిని పాల్గొన్నారు.
నేడు బాదేపల్లి మార్కెట్‌కు సెలవు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 6,600 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,229, కనిష్టంగా రూ.4,009 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,829, కనిష్టంగా రూ.5,739, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,409, కనిష్టంగా రూ.2,037 ధరలు పలికాయి. కాగా.. బాదేపల్లి మార్కెట్ యార్డులో శనివారం పంట దిగుబడుల క్రయవిక్రయాలను నిలిపివేస్తున్నట్లు మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి తెలిపారు. యార్డు ఆవరణలో రెండు రోజులుగా వచ్చిన పంట దిగుబడుల బస్తాలు పేరుకు పోయావని పేర్కొన్నారు. వ్యాపారులు తాము కొనుగోలు చేసిన బస్తాలను తరలించడంలో ఆలస్యం చోటు చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. దాదాపుగా 48 వేల బస్తాలు యార్డు ఆవరణలో నిలిచిపోయాయని చెప్పారు. సోమవారం యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment