ఎర్రవల్లి: పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి వస్తున్న ఇద్దరిని కారు రూపంలో మృత్యువు కబలించి.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కోదండాపురం ఎస్‌ఐ మురళి వివరాల మేరకు.. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన హరిజన బీసన్న (36), ఎండీ రఫి (62) కూలీ పని కోసం ద్విచక్ర వాహనంపై మంగళవారం కోదండాపురం వచ్చారు. కూలీ పనులను ముగించుకొని అర్ధరాత్రి సమయంలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కోదండాపురం కోల్డ్ స్టోరేజ్ సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా వస్తూ వీరి బైక్‌ను డీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి రక్తగాయాలు కావడంతో స్థానికులు హైవే అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇరువురు కూలీలకు ముగ్గురు చొప్పున సంతానం ఉన్నారు. మృతుడు హరిజన బీసన్న భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోషించే పెద్ద దిక్కులను కోల్పోయి ఇరువురి కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టిన కారు
ఇద్దరు కూలీల దుర్మరణం
ఎర్రవల్లి మండలం కోదండాపురంసమీపంలో ఘటన
కూలీ పనులకు వెళ్లొస్తూ.. అనంతలోకాలకు