గద్వాల క్రైం: ప్రైవేట్ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకే వ్యవసాయ, ఇంటి నిర్మాణం, వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తామని ఓ నకిలీ ఏజెంట్ పలువురి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కాజేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి బాధితులు, బ్యాంకు సిబ్బంది కథనం ప్రకారం.. గద్వాల మండలంకు చెందిన ఓ నకిలీ ఏజెంట్ గద్వాల, గట్టు తదితర గ్రామాలకు చెందిన రైతులు, గృహ నిర్మాణం, వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకే ఇపిస్తామని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే రుణాలు మంజూరు కోసం ఏజెంట్ బాధితుల నుంచి రూ.1–4 లక్షల వరకు వివిధ డాక్యుమెంట్ ఖర్చులు, రుణం మంజూరు చేసే వారికి ఇవ్వాల్సి ఉంటుందని గతేడాది వసూలు చేశాడు. బాధితులకు రుణం రూ.35 లక్షలు మంజూరైనట్లు నకిలీ పత్రాలను అందజేసి.. త్వరలోనే వ్యక్తిగత ఖాతాలో జమ అవుతుందని నమ్మించారు. అయితే నెలలు గడిచినా డబ్బులు జమ కాకపోవడంతో బాధితులు కర్నూలులోని సదరు ప్రైవేట్ బ్యాంకు సిబ్బందితో మాట్లాడారు. రుణాలు మంజూరు చేసిన పత్రాలను చూయించగా నకిలీవి అని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించి గద్వాల పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నకిలీ రుణాలు మంజూరు చేసిన పత్రాలు సదరు ప్రైవేట్ బ్యాంకు పేరుతో ఉండడంతో సదరు బ్యాంకు సిబ్బంది సైతం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ మాట్లాడుతూ బాధితులు, బ్యాంకు సిబ్బంది జరిగిన సంఘటన తమ దృష్టికి తెచ్చారని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామన్నారు.