అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ కోసం సహాయక బృందాలు నెలరోజులుగా శ్రమిస్తున్నాయి. కేరళకు చెందిన కడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతున్నా ఫలితం లేకపోతోంది. గత నెల 22న జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కకోగా.. ఈ నెల 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభ్యమైంది. సొరంగం కుప్పకూలిన 14 కిలోమీటరు వద్ద మట్టి, బండరాళ్లు, టీబీఎం శకలాల కింద మిగిలిన ఏడుగురు కార్మికులు ఉండి ఉంటారని సహాయక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ప్రదేశంలో మట్టి, బురద, రాళ్ల తొలగింపు ప్రక్రియ చేపడితే కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో ఆచితూచి తవ్వకాలు చేపడుతుండగా.. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరు కూడా సాహసం చేయడం లేదు. ఇదిలా ఉండగా.. ఆదివారం 30వ రోజు డీ1, డీ2 ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగాయి. టీబీఎం భాగాలను దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్లాస్మా కట్టర్లతో తొలగించి బయటకు పంపిస్తున్నారు. సొరంగంలో ఉబికి వస్తున్న నీరు, పేరుకుపోతున్న మట్టితో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాద ప్రదేశం వరకు పూర్తిస్థాయిలో విద్యుత్, వెంటిలేషన్ పనులు పునరుద్ధరించారు.
నేడు ముఖ్యమంత్రితో సమీక్ష..
సోమవారం శాసనసభ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొనేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, వికాస్‌సింగ్, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి డా. హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జీఎం బైద్య, ఎన్‌డీఆర్‌ఎఫ్ అడిషనల్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్ హోల్ మైనర్స్, అన్వి రోబోటిక్, కేరళ కడావర్ డాగ్స్ బృందంతో పాటు జేపీ కంపెనీకి చెందిన 12 రకాల సహాయక బృందాల ఉన్నతాధికారులు ఆదివారం తరలివెళ్లారు. సమీక్షలో ప్రధానంగా నెలరోజుల్లో తీసుకున్న చర్యలు.. ఎలాంటి సహాయక చర్యలు చేపడితే సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తేవచ్చనే అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
సహాయక చర్యలు వేగవంతం..
సొరంగంలో మట్టి తవ్వకాలు, డీ వాటరింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఆదివారం ఉదయం జేపీ కంపెనీ క్యాంపు కార్యాలయం వద్ద సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక బృందాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు సొరంగం లోపలి పరిస్థితులను ఆయనకు వివరించారు. సొరంగంలో అత్యంత ప్రమాద ప్రదేశంగా భావిస్తున్న ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రదేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. సహాయక బృందాలకు కావాల్సిన సదుపాయాలు, వసతులు కల్పిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు
అధికారులకు సవాల్‌గా మారిన ప్రమాదం
దొరకని కార్మికుల ఆచూకీ