నారాయణపేట రూరల్: బాలికను ప్రేమ పేరుతో అత్యాచారం చేసిన ఓ యువకుడికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్ధుల్ రఫీ మంగళవారం 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. నారాయణపేట మండలానికి చెందిన ఓ బాలిక హైదరాబాద్‌లోని బుద్వేల్ ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో అక్కడే పని చేస్తున్న వేముల అభిలాష్ (21) ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. మార్చి 1న బాలిక కర్ణాటకలోని అన్పూర్‌లో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తుండగా నారాయణపేట బస్టాండ్‌లో కిడ్నాప్ చేసి బుద్వేల్‌లోని ఓ ఇంట్లో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలియజేయడంతో 2వ తేదీన నారాయణపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకొని కోర్టులో హాజరుపర్చగా.. నేరం రుజువు కావడంతో మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.60 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందించాలని తీర్పునిచ్చారు. తక్కువ సమయంలో కేసు ఛేదించడంతో డీఎస్పీ లింగయ్య, సీఐ శివకుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, లైజనింగ్ అధికారి కృష్ణయ్యగౌడ్, విజయ్కుమార్, మీర్జా బేగ్‌ను ఎస్పీ అభినందించారు.
సైబర్ నేరస్తుడికి ఏడాది జైలుశిక్ష
ఊర్కొండ: సైబర్ నేరానికి పాల్పడి డబ్బులు కాజేసిన నిందితుడికి ఏడాది జైలుశిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తూ కల్వకుర్తి కోర్టు న్యాయమూర్తి కావ్య మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్‌ఐ కృష్ణదేవ వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన సత్యేంద్రరాయ్ మండలంలోని సూర్యలత కాటన్ మిల్లులో పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్ 9న ఓ యాప్ ద్వారా అతడు రూ. 1.25లక్షలు పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జార్ఖండ్ రాష్టానికి చెందిన ఎండీ అమీర్ అన్సారీ సైబర్ నేరానికి పాల్పడి డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రస్తుత సీఐ విచారణ జరిపారు. కల్వకుర్తి కోర్టులో సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడాది జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కావ్య తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ తెలిపారు.