
ఫిర్యాదులు లేకుండా సన్నబియ్యం పంపిణీ చేయాలి
మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీని చౌకధర దుకాణాల ద్వారా పేద కుటుంబాల కార్డుదారులకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం ధర్మాపూర్‌లో చౌకధర దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నాయి.. ఇప్పటి వరకు ఎంత మందికి బియ్యం పంపిణీ పూర్తయింది.. తదితర వివరాలను రేషన్‌డీలర్‌ను అడిగి తెలుసుకున్నారు. చౌకధర దుకాణంలోని బియ్యం నిల్వలు, వాటి నాణ్యతను పరిశీలించారు. సన్నబియ్యం లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి సన్న బియ్యం పంపిణీపై వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేషన్‌దుకాణాల్లో సమయపాలన పాటించాలని, రైతులు పనులకు వెళ్లి ఉదయం రాలేని వారికి సాయంత్రం కూడా పంపిణీ చేయాలని డీలర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సుందర్‌రాజ్ ఉన్నారు.
సన్న బియ్యం రవాణా
వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రేషన్‌షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు బియ్యాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి బియ్యం రవాణాపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రేషన్ దుకాణాల్లో అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం రవినాయక్ తదితరులు పాల్గొన్నారు