
ఇసుక డంపు స్వాధీనం
కోస్గి: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును శుక్రవారం రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కడంపల్లి వాగులో 100 ట్రిప్పులకు పైగా ఇసుక నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో తహసీల్దార్ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పట్టుబడిన ఇసుకను చంద్రవంచలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తరలించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని వివరించారు. ఆర్‌ఐలు సుభాష్‌రెడ్డి, లింగారెడ్డి, జేఏ హన్మంతు, సిబ్బంది వెంకట్రాములు, బుగ్గప్ప, వెంకటయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ప్రేమించాడని యువకుడిపై దాడి
నవాబుపేట: యువతిని ప్రేమించాడన్న కారణంతో యువకుడిపై యువతి కుటుంబీకులు దాడిచేసి గాయపర్చిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విక్రమ్ కథనం మేరకు.. మండలంలోని పల్లెగడ్డకు చెందిన అరవింద్ జిల్లాకేంద్రంలోని పాత పాలమూర్‌కు చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు యువతి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తెలిసింది. దీంతో శుక్రవారం యువతికి సంబంధించిన వ్యక్తులు పల్లెగడ్డకు వచ్చి మాట్లాడదాం రమ్మంటూ అరవింద్‌ను గ్రామం బయటకు తీసుకొచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పృహతప్పి పడిపోగా అక్కడ ఉన్న కొందరు డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో పోలీసు వాహనం అక్కడికి చేరుకోగా దాడిచేసిన వ్యక్తులు పరారయ్యారు. వాహనాలను ఘటన స్థలంలో వదిలిపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.