
డబ్ల్యూఈపీఎల్ లీగ్‌కు గణేష్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్‌కు చెందిన గణేష్ క్రికెట్‌లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాడు. వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఈపీఎల్) ప్రేమ్ 2 డివిజన్, వరిష్ట చెల్టినహమ్ ప్రీమియర్ టీ–20, డబ్ల్యూఈపీఎల్ టీ–20, నేషనల్, కంట్రీకప్ టోర్నమెంట్‌ల్లో అతడు ఆడనున్నాడు. గణేష్ ప్రతిభను గుర్తించిన అక్కడి నిర్వాహకులు టోర్నీల్లో ఆడడానికి అవకాశం కల్పించారు. మంగళవారం ఇంగ్లాండ్‌కు బయలుదేరుతున్న అతడు ఆరునెలల పాటు అక్కడి క్రికెట్ పోటీల్లో పాల్గొననున్నాడు. డబ్ల్యూఈపీఎల్ క్రికెట్ టోర్నీలకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని గణేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
హెచ్‌సీఏ టోర్నీల్లో సత్తా
గణేష్ ఎండీసీఏ, హెచ్‌సీఏ క్రికెట్ అసోసియేషన్ టోర్నీల్లో సత్తా చాటుతున్నాడు. హెచ్‌సీఏ అండర్–16, అండర్–19, అండర్–23 జట్లకు పలుసార్లు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించాడు. హెచ్‌సీఏ కంబైన్ జిల్లా జట్టుకు ఎంపికై రాణించాడు. 2019–20లో హైదరాబాద్‌లో జరుగుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎ–2 డివిజన్ లీగ్ మ్యాచ్‌లో గణేష్ అద్భుతమైన బ్యాటింగ్‌తో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. రాజు క్రికెట్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గణేష్ ట్రిపుల్ సెంచరీ చేసి సీజన్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్‌లో 200 బంతుల్లో 42 ఫోర్లు, 7 సిక్స్‌లతో 318 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే సీజన్‌లో మరో ట్రిపుల్ సెంచరీ (329పరుగులు) చేశాడు. జింఖానా మైదానంలో జరిగిన సీనియర్ జోనల్ క్రికెట్ టోర్నీలో కంబైన్డ్ జట్టు తరపున రెండు మ్యాచుల్లో కలిపి 350 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్‌లో నాలుగు టోర్నీల్లో పాల్గొననున్న జిల్లా క్రీడాకారుడు
8న ఇంగ్లాండ్‌కు పయనం
సన్మానించిన జితేందర్‌రెడ్డి, ఎండీసీఏ ప్రతినిధులు
గణేష్‌కు సన్మానం
డబ్ల్యూఈపీల్ టోర్నీలకు వెళ్తున్న గణేష్‌ను హైదరాబాద్‌లో శనివారం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు, ఎండీసీఏ అధ్యక్షులు ఏపీ జితేందర్‌రెడ్డి శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు. టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరచి జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ఆబిద్ అలీ పాల్గొన్నారు.