
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం
పాలమూరు: క్షేత్రస్థాయిలో పార్టీ ఎంతో బలపడటంతోపాటు తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదట ఎంపీ నివాసంలో నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి.. పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 25 వరకు చేపట్టబోయే కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ పాల్గొనాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గాంవ్ చలో– బస్తీ చలో పేరుతో ఊరూరా ప్రత్యేక కార్యక్రమం, ఈ నెల 13 నుంచి 25 వరకు అంబేడ్కర్ సంయాన్ అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 13న ప్రతి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహాన్ని శుభ్రం చేయడం, 14న విగ్రహాల దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలన్నారు.
దేశ చరిత్రలో కీలక ఘట్టం
వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చడం దేశ చరిత్రలో మరో కీలక ఘట్టమని, దేశంలో వేలాది మంది వక్ఫ్ బాధితులకు న్యాయం జరుగుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ కార్యాలయం దగ్గర ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో వక్ఫ్ పేరుతో లిటిగేషన్‌లో ఉన్న వేలాది ఎకరాల భూములకు రిలీఫ్ రాబోతుందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో మైనార్టీల ఆస్తులు, మసీద్‌లు, కబ్రస్తాన్‌లు తీసుకుంటారని జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. వక్ఫ్ పేరుతో జరిగిన మోసాలకు ఈ చట్టం చెక్ పెడుతుందన్నారు. ఇకపై అసలైన మైనార్టీ మహిళలు, వితంతువులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పద్మజారెడ్డి, జయశ్రీ, పాండురంగారెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.