
విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత
స్టేషన్ మహబూబ్‌నగర్: నియోజకవర్గంలో విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్‌తో కలిసి ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ పేరుతో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని, తక్కువ సమయంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వస్తాయన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేస్తామని తెలిపారు. టెట్, డీఎస్సీ, వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, గ్రూప్స్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర గ్రంథాల య సంస్థ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాలకు ఉచిత శిక్షణ ప్రారంభించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ నవరత్నాలు ద్వారా 250 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ నిర్వహించడం, మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకొని, రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ ఫస్ట్ కోచింగ్ సెంటర్ అడ్మిషన్ దరఖాస్తులను ఆవిష్కరించారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కోచింగ్ ఫ్యాకల్టీ రవికుమార్, గాలి బాల్‌రాజు, నాని యాదవ్, రాజేంద్రచారి పాల్గొన్నారు.