
పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం
మహబూబ్‌నగర్ రూరల్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కోడూర్‌లోని ఎస్సీ కాలనీలో రేషన్‌కార్డు లబ్ధిదారుడు హెచ్.గోపాల్, సత్యమ్మ ఇంట్లో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు. జిల్లాలో మొత్తం 506 చౌకధర దుకాణాల ద్వారా 5,228 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడూర్‌లో 761 రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చౌకధర దుకాణాల ద్వారా అర్హత గల లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి టి.వెంకటేష్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రవినాయక్, తహసీల్దార్ సుందర్‌రాజ్, ఎంపీడీఓ కరుణశ్రీ ఉన్నారు.
సన్న బియ్యం బాగుంది..
సన్న బియ్యం ఎలా ఉందని కలెక్టర్ అడగగా.. బాగుంది మేడం అని గోపాల్ చెప్పాడు. కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను తన భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారని గోపాల్ కలెక్టర్‌కు తెలిపాడు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ప్రతి ఒక్కరూ రేషన్‌షాపుల ద్వారా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గోపాల్ కుమారుడితో మాట్లాడుతూ ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా.. ‘కలెక్టర్ తన ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు భోజనం చేయడం ఆ నందంగా ఉందని, మా జీవితంలో మర్చిపోలేం.’ అని లబ్ధిదారుడు గోపాల్ తెలిపారు.
కలెక్టర్ విజయేందిర బోయి