సొరంగంలో కొనసాగుతున్న మట్టి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

సొరంగంలో కొనసాగుతున్న మట్టి తొలగింపు

Published Sat, Apr 12 2025 2:13 AM | Last Updated on Sat, Apr 12 2025 2:13 AM

సొరంగ

సొరంగంలో కొనసాగుతున్న మట్టి తొలగింపు

అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం లోపల కన్వేయర్‌ బెల్టు పొడిగింపు పనులు దాదాపు పూర్తి అయ్యాయి. సొరంగం ప్రమాదం జరిగి శుక్రవారం నాటికి 49 రోజులు అవుతోంది. ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగం, రెస్క్యూ టీములు, టన్నెల్‌ నిపుణుల సమన్వయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయక బృందాలు నాలుగు రోజులు శ్రమించి 13.730 కిలోమీటరు నుంచి 13.800 కిలోమీటరు వరకు కన్వేయర్‌ బెల్టు జాయింట్‌ చేసి పొడిగించారు. మట్టి, బురద, రాళ్లు, టీబీఎం భాగాలు తొలగింపు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. తొలగించిన మట్టి ఎస్కవేటర్లతో కన్వేయర్‌ బెల్టుపై ఎత్తిపోస్తున్నారు. ఐదు ఎస్కవేటర్లతో సొరంగం లోపల తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలకు ఆటంటకంగా మారిన నీటి ఊటను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల సహాయంతో సొరంగం బయటకు పంపింగ్‌ చేస్తున్నారు. మిగిలిన 70 మీటర్ల ప్రదేశంలో శిథిలాలను పూర్తిగా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. సొరంగం పైకప్పు కూలిన అత్యంత ప్రమాదకరమైన 13.936 కిలోమీటరు ప్రదేశంలో ఇప్పట్లో తవ్వకాలు జరిపే అవకాశం లేదని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులో ఈ పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సొరంగం ప్రమాద ప్రదేశంలో మట్టి, బురద తవ్వకాలు కొనసాగుతున్నాయని, సహాయక చర్యలు ముమ్మరం చేశామని ప్రత్యేక అధికారి శివశంకర్‌ లోతేటి అన్నారు. శుక్రవారం సొరంగం ఇన్‌లెట్‌ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారి ఆచూకీ కొనుకొనేందుకు సహాయక బృందాలు ఎంతో శ్రమిస్తున్నాయన్నారు. సొరంగం లోపల భారీగా పేరుకపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం భాగాలను కత్తిరించే పనులు నిరాంతరాయంగా కొనసాగుతున్నాయని, తవ్వకాలు చేపట్టి ప్రదేశం నుంచి మట్టిని కన్వేయర్‌ బెల్టు ద్వారా సొరంగం బయటకు తరలిస్తున్నామన్నారు. ఉబికి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్లతో పంపింగ్‌ చేస్తూ బయటకు తరలించే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్‌, విజయ్‌కుమార్‌, జేపీ కంపెనీ సీనియర్‌ ప్రాజెక్టు ఇంజినీర్‌ సంజయ్‌కుమార్‌ సింగ్‌, సింగరేణి మైన్స్‌ రెస్క్యూ జనరల్‌ మేనేజర్‌ బైద్య, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

49 రోజులుగా శ్రమిస్తున్నా..

లభ్యం కాని ఆరుగురి ఆచూకీ

సొరంగంలో కొనసాగుతున్న మట్టి తొలగింపు 1
1/1

సొరంగంలో కొనసాగుతున్న మట్టి తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement