
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని పీయూ అకాడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. రీసెర్చ్ కెరీర్‌ను ఎంచుకోవడం వల్ల మిగతా విద్యార్థుల కంటే కూడా జీవితంలో త్వరగా స్థిరపడేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీ రవికుమార్, శ్రీధర్‌రెడ్డి, రామ్మోహన్, జ్ఞానేశ్వర్, సిద్దరామగౌడ్, రామరాజు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
20 మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: 317 జీఓలో గతంలో ఇబ్బందులకు గురైన స్పౌజ్ ఉపాధ్యాయులకు త్వరలో బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు గతంలో తమకు బదిలీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం ఈ అంశంపై నిర్ణయం తీసుకుని బదిలీలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 20 మంది బదిలీపై రానున్నారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీ కానున్నారు. కాగా 8 మంది టీచర్లు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ప్రభు త్వం చాలా పోస్టులు భర్తీ చేసింది. ఖాళీలు ఎక్కువ లేని క్రమంగా మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు బై పోస్టుల కింద భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. 20 మంది ఉపాధ్యాయులకు అన్ని పరిశీలించి ఈ నెల 22లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభు త్వం విద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తోందని విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లాకేంద్రంలో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాపరంగా అనేక మార్పులు తెస్తోందని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. యాదవులు తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. చదువు ద్వారానే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. చదువు ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలు లభిస్తాయ ని పేర్కొన్నారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే విద్యతోనే అది సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్మాలన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటనర్సయ్య, నాయకులు నాచా శ్రీనివాస్ యాదవ్, యువజన సంఘం జిల్లా కార్యదర్శి చందుయాదవ్, కృష్ణ, ప్రవీణ్, గోపాల్ పాల్గొన్నారు.