
‘పాలమూరు’ పనుల పరిశీలన
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు సమీపంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ పనులను ఈఎన్‌సీ అనిల్ కుమార్‌తో పాటు ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా 1, 2, 3 ప్యాకేజీల పనుల పురోగతిని తెలుసుకున్నారు. 3వ ప్యాకేజీ పనులను డ్రోన్ కెమెరాలతో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు ప్రధాన కాల్వ పనులను పరిశీలించారు. పంప్‌హౌజ్, ప్రధాన కాల్వ హెడ్ రెగ్యులెటరీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ను సందర్శించి.. పంప్‌హౌజ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 817 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కరివెన, వట్టెం రిజర్వాయర్ల పనులను త్వరగా పూర్తిచేసి.. 50 టీఎంసీల నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు, జేఈలు పాల్గొన్నారు.