ముంబై: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ఆ పరిస్థితి తీవ్రంగా ఉంది. తాజాగా గవర్నర్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవగా ఆయనకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిసి ఆయన ప్రైవేటు విమానంలో డెహ్రూడన్ వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో వివాదం రాజుకుంది. గవర్నర్ విమాన ప్రయాణానికి ముఖ్యమంత్రి అడ్డు తగిలారనే విమర్శలు వస్తున్నాయి.
మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మధ్య విభేదాలు పెరిగాయి. అవి తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయి. గవర్నర్ విమాన ప్రయాణానికి మహా అఘాడీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన విషాద సంఘటన గురించి తెలుసుకునేందుకు విమానంలో డెహ్రడూన్ వెళ్లేందుకు కోశ్యారి సిద్ధమయ్యారు. ఈ మేరకు ముంబైలోని విమానాశ్రయానికి వెళ్లి రెండు గంటల పాటు వేచి ఉన్నారు. ప్రభుత్వ విమానంలో కూర్చున్న తర్వాత 15 నిమిషాల తర్వాత టేకాఫ్‌కు అనుమతి రాలేదని ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చెప్పారు. దీంతో కోశ్యారి చివరికి మరో విమానంలో టికెట్ బుక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చింది.
వారం కిందటే గవర్నర్ పర్యటన గురించి ప్రభుత్వానికి చెప్పినా.. అనుమతి రాకపోవడం చాలా అసహజంగా ఉన్నదని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెప్పాయి. దీనిపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్‌కు విమానం ఇచ్చారో లేదో తనకు తెలియదని, కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటానని చెప్పారు. దీనిపై శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కూడా స్పందించారు. ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు గవర్నర్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రభుత్వ అనుమతి కోరారని అయితే ఆ విమానం ప్రయాణించగలదా లేదా అని తెలియలేదని పేర్కొన్నారు. ఈ కారణంగానే గవర్నర్‌కి అనుమతి లభించకపోయి ఉండవచ్చని తెలిపారు.
అయితే ప్రభుత్వ నిబంధనలు మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు హక్కు ఉంది. ఇతరులు వాడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగానే అనుమతి లభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కక్షపూరితంగానే ప్రభుత్వం గవర్నర్‌కు విమానం అనుమతి ఇవ్వలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య గతంలోనే వివాదాలు ఉన్నాయి. లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై గవర్నర్ ప్రశ్నించారు. దీనిపై సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్‌కు మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఇప్పుడు తాజాగా విమాన అనుమతి విషయమై వివాదం రేగేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment