ముంబై: మహారాష్ట్రలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవుతుండడంతోపాటు త్వరలోనే మంత్రి కాబోతున్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తన పదవికి రాజీనామా చేశారు. సంప్రదాయం ప్రకారం స్పీకర్ అనే వ్యక్తి ఏ పార్టీ పదవి అధిరోహించవద్దు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతుండడంతో స్పీకర్ పదవికి రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి మిగతా మిత్రపక్షాలు కూడా అంగీకారం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన కుంబీ సామాజిక వర్గ నేత నానా పటోలే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో పార్టీ బలోపేతం కోసం.. తిరిగి పుంజుకోవడానికి బలమైన నాయకుడిగా ఉన్న నానా పటోలేను పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక చేయనుంది. దీంతో పాటు రాష్ట్ర మంత్రిగా కూడా ఎన్నికవ్వనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవికి పటోలే రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఢిల్లీలో అధిష్టానంతో నాయకులు చర్చించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడిగా అధికారంలో ఉన్నాయి. స్పీకర్‌ను మార్చాలంటే మిగతా రెండు పార్టీలను అంగీకారం ఉండాల్సిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఈ విషయమై శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సంప్రదించగా వారు అంగీకరించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. స్పీకర్ పదవికి పటోలే రాజీనామా లేఖ సమర్పించారు.
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే నానా పటోలే రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్‌తోనే. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి 2014లో భండయా-గోండియా లోక్‌సభ సభ్యుడిగా పటోలే ఎన్నికయ్యారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించడంతో బీజేపీ అతడిని బహిష్కరించింది. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాడు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికై మహా వికాస్ అఘాడి (శివసేన+ఎన్సీపీ+కాంగ్రెస్) ప్రభుత్వం ఏర్పడగా నానా పటోలే స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment