వ్యర్థాలు సేకరించే కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో ప్రతీ శనివారం ‘పునరాలోచన దినం’ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం. నిర్ణయించింది. ఈమేరకు అన్ని పురపాలికలకు తాజాగా ఆదేశాలందాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు పాతవస్తువులను సేకరించి అవసరమైన వారికి ఉచితంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పేరుకు పోతున్న చెత్తాచెదారం తొలగించడంతోపాటు, ఇళ్లల్లో నిరుపయోగంగా ఉంటున్న వస్తువులను సేకరించి స్వచ్ఛతను సాధించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో ప్రజల్లోకి వెళ్లి పాత దుస్తులు, పుస్తకాలు సేకరించి ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాల్లో భద్రపరుస్తారు. ఈమేరకు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్(ఆర్‌ఆర్‌ఆర్) పేరిట కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గతనెల 15వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు 20 రోజులపాటు అధికారులు వార్డుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
మరొకరికి ఉపయోగం
ప్రజల నుంచి వీలైనంత వరకు చెత్తను సేకరించేలా పలు కార్యక్రమాలు చేపడుతుండగా, సేకరించిన పనికిరాని వస్తువులను, వాడని పాత వస్తువులను అవసరమైన వారు వినియోగించుకునేలా ప్రతీ మున్సిపాలిటీలో ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా స్వచ్ఛత అవార్డుల్లో పోటీ పడేందుకు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతీ శనివారం రీథింక్ డే(పునరాలోచన దినం)గా పాటించాలని నిర్ణయించారు. ఇలా సేకరించిన వస్తువులను నిర్వాహకులు పేదలకు పంపిణీ చేస్తారు. సేకరించిన వస్తువుల వివరాలను సేకరించిన వారి చిరునామాను కేంద్రంలోని (తగ్గింపు) దస్త్రాల్లో నమోదు చేస్తారు. చిత్తుకాగితాలు ఉంటే వాటిని డంపింగ్ యార్డుకు తరలిస్తారు.
స్వయం సహాయక సంఘాల కీలకపాత్ర
ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయిదారు వార్డులకు కలిపి ఒక చోట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలో 10 మంది సభ్యులున్నారు. వారు ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, వార్డు కమిటీలు భాగస్వామ్యం అయ్యేలా అధికారులు అవగాహన కల్పిస్తారు.
మెప్మా ఆర్పీల సహకారం, మున్సిపల్ కార్మికులతో కలిసి మున్సిపల్ అధికారులు వార్డుల్లో శుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వడంపై ప్రజలకు తెలియజేస్తున్నారు. శ్రీమేరా లైఫ్... మేరా స్వచ్ఛ షెహర్‌శ్రీ పేరిట ఆర్‌ఆర్‌ఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాల్లో స్వచ్ఛ ర్యాంకులను సాధించేందుకు అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment