ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా

Published Wed, May 8 2024 12:40 AM

-

● ఈసీ ఆధ్వర్యంలో వ్యయ పరిశీలకుల పర్యవేక్షణ ● ఎప్పటికప్పుడు అభ్యర్థుల ఖర్చులపై ఆరా

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): లోక్‌సభ ఎన్నికల్లో ధనబాలానికి తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన వెంటనే జిల్లా సరిహద్దులతోపాటు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి వెంట తీసుకెళ్తున్న నగదు సహా బంగారం, వెండి ఆభరణాలు, మద్యం, చీరలు, ఇతర కానుకలు, వస్తువులు ఏవైనా గుర్తించి సీజ్‌ చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 749 తనిఖీల్లో రూ.3,71,36,272 పైగా విలువైన 89,508 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 328 మందిని అరెస్ట్‌ చేసి 25 బెల్ట్‌ దుకాణాలు మూసి వేయించారు. ఇక వాహన తనిఖీల్లో భాగంగా 80 వాహనాల్లో రూ.97,72,502 నగదు, రూ.36,808 విలువైన ఇతర వస్తువులు సీజ్‌ చేశారు.

వ్యయ పరిశీలకులు..

ఎన్నికల్లో ధనప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఐఏ ఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐడీఏఎస్‌ స్థాయి అధి కారులను ఈసీ వ్యయ పరిశీలకులుగా నియమించింది. లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తున్నారు. పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ అధికారి(ఐడీఏఎస్‌) సమీర్‌ నైరన్‌తర్య జిల్లా రిటర్నింగ్‌, ఎన్నికల అధికారులతో సమావేశమై అభ్యర్థుల ఖర్చులపై ఆరా తీశారు.

సీ–విజిల్‌కు ఫిర్యాదులు..

సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఈ నెల 5వరకు 78 ఫిర్యాదులు అందాయి. మెజారిటీ ఫిర్యాదులు ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలకు సంబంధించినవే ఉన్నాయి. ఫిర్యాదు అందిన గంటన్నరలోగా సంబంధిత బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటున్నారు.

 
Advertisement
 
Advertisement