● పకడ్బందీగా నాలుగు పథకాల అమలు ● జిల్లా అభివృద్ధికి పెద
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని జిల్లాలో అర్హులందరికీ లబ్దిచేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 76వ గణతంత్ర వేడుకలను జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ మోతీలాల్, డీసీపీ భాస్కర్, డీఎఫ్‌వో శివ్‌ఆశిష్‌సింగ్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ కుమార్ దీపక్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రిజర్వు పోలీస్ కమాండర్ వామనమూర్తి ఆధ్వర్యంలో కలెక్టర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత కుమార్ దీపక్ మాట్లాడారు. లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలా లు అందించడం జరుగుతుందన్నారు.
మహాలక్ష్మి పథకం..
జిల్లాలో ఆడపడుచులు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,30,51,686 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యం వినియోగించుకున్నారన్నారు. తద్వారా మహిళలకు రూ.32.47 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు. జిల్లాలో 1,13,75 మంది లబ్ధిదారులకు రూ.500 సబ్సిడీ సిలిండర్ అందిస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమి తిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తుండడంతో జిల్లాలో 6,950 మంది పేదలు లబ్ధిపొందారని తెలిపారు. వీరికి సుమారు రూ.11.14 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
గృహజ్యోతి పథకం..
విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వినియోగదారులకు 200 యూని ట్లలోపు విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. 2024 మార్చి నుంచి డిసెంబర్ 2024 వరకు జీరో బిల్లు లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 41.48 కోట్లు రాయితీ అందజేసిందన్నారు.
రుణమాఫీ: రూ.2 లక్షల రుణ మాఫీ పథకం ద్వారా జిల్లాలో 64, 493 మంది రైతులకు రూ.543 కోట్ల మాఫీ చేసిందన్నారు. జిల్లాలో 83,114 మంది రైతులకు రైతుబీమా ప్రయోజనం కింద చేర్చి 149 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రూ.7.45 కోట్లు చెల్లించామన్నారు. రైతు భరోసా ప్రత్యేకంగా అమలుకు చర్యలు చేపట్టామన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 18,108 మంది రైతుల నుంచి 1,01,485 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.235 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సన్న వడ్లకు బోనస్ రూ.500 చెల్లించామన్నారు. వరద నీటి నుంచి రక్షణ కోసం కార్మెల్ ఉన్నత పాఠశాల సమీపంలోని రాళ్లవాగు నుంచి గోదా వరి వరకు రూ.255 కోట్ల వ్యయంతో కరకట్ట నిర్మాణానికి అనుమతిలు లభించిందన్నారు.
ఇందిరా మహిళ శక్తి:
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు క్యాంటీన్లు, మీ సేవ కేంద్రాలు, చిన్నపరిశ్రమలు ఇతర వ్యాపార విభాగాల ఏర్పాటుకు బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాలు మహిళలకు ఆర్థిక చేయుత అందించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రూ.10 లక్షల విలువ గల సంచార చేపల అమ్మకం వాహనాన్ని లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భా గంగా జరిపిన సర్వేలో ఇంటి స్థలం ఉండి పక్కా ఇ ల్లు లేని వారు 82,161 మంది, ఇంటి స్థలాలు లేని వారు 50,912 మందిని గుర్తించామన్నారు.
గ్రామీణాభివృద్ధి: జిల్లాలో 10,417 స్వయం సహాయక సంఘాలలో 1,15000 మంది సభ్యులు ఉండగా 2024–25 సంవత్సరానికి బ్యాంక్ లింకేజీ ద్వారా 3, 578 సంఘాలకు రూ.328 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో 1,21000 వేల జాబ్‌కార్డులు అందించి 100 రోజుల పని కల్పించడం ద్వారా వేతనాల రూపంలో రూ.59.65 కోట్లు చెల్లించడంతో పాటు రూ.9.70 కోట్ల సామగ్రి సమకూర్చబడిందన్నారు.
పురపాలక సంఘాలు.. జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సమీకృత కూరగాయల మార్కెట్లు, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, ప్లే గ్రౌండ్లు, చిల్డ్రన్ పార్కులు, మురుగు కాల్వలు, మహిళ భవనాలు, ఓపెన్ జిమ్‌లు, అంతర్గత రోడ్లు, వీధి దీపాల ఏర్పాట్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్, పబ్లిక్ టాయిలెట్స్, మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్ల నిధులతో అధునాతన సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.
జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్
నందిని నృత్యకళా మందిరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన
భరతమాత
వేషధారణలో విద్యార్థిని
రహదారులు, భవనాలు
హాజీపూర్ మండలం గుడిపేటలో రూ.205 కోట్ల వ్యయంతో అధునాతన పరిజ్ఞానంతో వైద్య కళాశాల నిర్మాణం జరుగుతుందని, రూ.81 కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మాణం పనులు సాగుతున్నాయన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రూ.300 కోట్ల ప్రతిపాదనలతో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, నర్సింగ్ కళాశాల ద్వారా వైద్య విద్య కోసం రూ.40 కోట్లతో భవన నిర్మాణం, రూ.3 కోట్ల వ్యయంతో మందుల నిల్వ గిడ్డంగి నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు.
● గ్రామాల అభివృద్ధి, గ్రామ వికాసమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థను వినూత్నమైన సంస్కరణలతో ప్రజల ముంగిట నిలించిందన్నారు.
● 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పన్నుల లక్ష్యం రూ.69 కోట్లకు గాను రూ.54 కోట్లు ప్రగతి సాధించి జిల్లాలో 2,95,760 వాహనాల రిజిస్ట్రేషన్ చేయడంపాటు రహదారులపై నియమ నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 16,205 మంది తమ వివరాలు నమోదు చేసుకోగా 12 జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా 105 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. జిల్లా అభివృద్దికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, బెల్లంపల్లి, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
మంచిర్యాలఅగ్రికల్చర్: గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హజీపూర్ జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ సబ్బెపల్లి విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. కళాశాల దశలో విద్యార్థులు, యువత చదవుకు దూరం అవుతూ.. చెడుమార్గాన్ని ఎంచుకుని ప్రేమపేరుతో మహిళలను వేధిస్తూ.. ఉన్మాదిలా ప్రవర్తిస్తూ.. హత్యలకు వెనుకడాని తీరు.. భరత మాత భావోద్వేగం..జైలు పాలవుతున్న యువత.. పలు రకాల సన్నివేశాలు కండ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్, డీసీపీ భాస్కర్, అటవీశాఖ అధికారి శివ్‌ఆశిష్ సింగ్ విద్యార్థులను అభినందించి జ్ఞాపికలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment