● ‘పీఎం సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన’కింద ఎంపిక ● ఉమ్మడి జిల్లాలో రెండు మోడల్ గ్రామాలు ● పూర్తయిన సర్వే
మంచిర్యాలఅగ్రికల్చర్: గ్రామీణ ప్రాంత ప్రజలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ‘సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన’ పథకం కింద సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో ఒక గ్రామాన్ని మోడల్ తీర్చిదిద్దనున్నారు. దీంతో ఆ గ్రామాల్లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సపూర్, మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మండలం వెంకట్రావ్‌పేట్‌ను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేశారు. కాగా ఆ గ్రామాల్లో ఎన్‌పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేశారు. ఎన్ని ఇండ్లు, విద్యుత్ సర్వీస్ మీటర్లు, వ్యవసాయ కనెక్షన్లు, తదితర వివరాలపై సర్వే చేపట్టారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించి, తదుపరి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ చెబుతున్నారు.
సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా..
కేంద్ర ప్రభుత్వం, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా, రాష్ట్రంలో రెడ్‌కో విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతీ జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దనున్నారు. సౌరశక్తి గ్రామంగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం రూ. కోటి సాయం అందిస్తుంది. స్థానిక ఉత్పత్తి చేయడం విద్యుత్ ఖర్చులు తగ్గనున్నాయి.
ఇంటి యజమానికి ఆదాయం..
రూప్ లెవల్ బిల్డింగ్‌పై కిలోవాట్ సోలార్ ఏర్పాటుకు 80 నుంచి 90 స్క్వేర్ ఫీట్లు, 2 కిలోవాట్స్ సోలార్ ప్లాట్ ఏర్పాటుకు 160 నుంచి 190 స్క్వేర్ ఫీట్లు, 3 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 270 స్క్వేర్ ఫీట్ల స్థలం అవసరం ఉంటుంది. వ్యవసాయ బోరుబావుల వద్ద 7.5 కిలోవాట్స్ ప్లాంట్ ఏర్పాటుకు బోరుబావుల నుంచి 100 మీటర్ల డీయషన్ పరిధిలో సరైన ప్రదేశం అవసరం ఉంటుంది. 2 కిలోవాట్స్ ప్లాంటు ఏర్పాటు అయితే ఇంటి యజమానికి నెలకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల ఆదాయం వరకు, బోరు బావుల వద్ద 7.5 కిలోవాట్స్ ప్లాంటుకు రూ. 5 వేల నుంచి రూ 6 వేల వరకు ఆదాయం యజమానికి చేరుతుంది. దీంతో పాటు రైతు గృహ అవసరాలకు విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది.
సర్వే పూర్తి చేశాం..
ప్రధాన మంత్రి సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. మోడల్ గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుకు చేసేందుకు సర్వే చేశాం. ఏడీఈ, ఏఈ, సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటి వివరాలు, యాజమాని పేరు, ఆధార్‌కార్డు వివరాలు సేకరించారు. రైతులకు సోలార్ ప్లాంట్ ప్రయోజనాలను వివరించాం.
– గంగాధర్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, మంచిర్యాల
ఎంపిక చేసిన గ్రామాల వివరాలు..
గ్రామం విద్యుత్ కనెక్షన్లు రిజిస్ట్రేషన్ వ్యవసాయ కనెక్షన్లు రిజిస్ట్రేషన్
వెంకట్రావుపేట 1415 1405 346 340
నర్సపూర్ 131 128 76 75
ఉమ్మడి జిల్లాలో రెండు గ్రామాలు..
సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, సమాజం తమ ఇంధన అవసరాలకు తీర్చుకోవడంలో స్వావలంబన పొందేలా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోడల్ సోలార్ విలేజ్ అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం అమలుకు రాష్ట్రంలోని 17 జిల్లాలలో 8 గ్రామాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ డివిజన్ పరిధిలో నర్సపూర్, మంచిర్యాల జిల్లా పరిధిలో లక్షేట్టిపేట మండలం వెంకట్రావ్‌పేట్ గ్రామాలను ఎంపిక చేశారు. నర్సపూర్‌లో 131 విద్యుత్ మీటర్లుకు 128ఇండ్లను అర్హతగా గుర్తించారు. వ్యవసాయ బోర్లు 75 నమోదు పూర్తి చేశారు. వెంకట్రావ్‌పేటలో 1415 విద్యుత్ మీటర్లకు 1405, 346 వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లకు 340 నమోదు చేశారు. మొత్తం 1746 కనెక్షన్‌లు నమోదు చేశారు. ఇంటి యజమాని పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్, రూప్ లెవల్‌లో ఉన్న స్థలం వివరాలను సేకరించారు. ఎంత సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటు చేయాలో వివరాలు సేకరించారు. ఆ వివరాలను సూర్యఘర్ పోర్టల్‌లో నమోదు చేశారు.
గ్రామాల్లో సౌర వెలుగులు..!