ఆన్‌లైన్‌ ప్రవేశాలు జరిగేనా..? | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ప్రవేశాలు జరిగేనా..?

Published Sat, Mar 29 2025 12:08 AM | Last Updated on Sat, Mar 29 2025 12:10 AM

● ఇంటర్‌ విద్యలో అమలుపై స్పష్టత కరువు ● మాన్యువల్‌గానే ప్రవేశాలు ● విద్యార్థులపై ప్రైవేట్‌ యాజమాన్యాల ఒత్తిడి

బోథ్‌: డిగ్రీలో అమలు చేస్తున్న దోస్త్‌ విధానం తరహాలోనే ఇంటర్‌ ప్రవేశాలపై పీటముడి నెలకొంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం వచ్చినా.. మాన్యువల్‌ గానే ప్రవేశాలు పొందుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ కళాశాలల్లో చేరాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పైవేట్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థుల ప్రవేశాలపై స్పష్టత కరువైంది.

ప్రైవేట్‌ కళాశాలల ఆగడాలను చెక్‌..

ఇంటర్‌ ప్రవేశాల్లో దోస్త్‌ తరహా ఆన్‌లైన్‌ విధానం అమలైతే విద్యార్థులకు మేలు జరుగుతుంది. విద్యార్థి తనకు నచ్చిన కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకునే వీలుంటుంది. పదో తరగతిలో విద్యార్థికి వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి. ఈ విధానంతో విద్యార్థి తనకు నచ్చిన కళాశాలలో చదివే వీలు ఉంటుంది. వివిధ ఫేజ్‌లతో కూడిన ప్రవేశాలు ఉంటే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉండదు. ఇంటర్‌లో కూడా డిగ్రీ మాదిరిగానే ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపడితే ప్రైవేట్‌ కళాశాలల ఆగడాలను చెక్‌ పడనుంది.

విద్యార్థుల వద్దకు పీఆర్‌వోలు..

పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశాలు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈక్రమంలో ప్రైవేట్‌ యాజమాన్యం క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. తల్లిదండ్రులను కలిసి తమ కళాశాలల్లో చేరాలని కోరుతున్నారు. విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. కాగా ఆయా కార్పొరేట్‌ కళాశాలలకు చెందిన పీఆర్‌వోలు విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

మొదట చేరి.. తరువాత తిరిగి వచ్చి..

పదో తరగతి పరీక్షలను విద్యార్థులు రాయకముందే పలు ప్రైవేట్‌ కళాశాలలకు చెందిన పీఆర్‌వోలు విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను కలిసి తమ కళాశాల గురించి వివరించి అడ్మిషన్లు చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలోనే వేలల్లోనే ఫీజులు కట్టించుకుంటున్నారు. ఇక పదో తరగతి పాస్‌ కాగానే విద్యార్థి కనీసం నెల రోజులు కూడా కళాశాలలో ఉండకుండా ఇంటికి వచ్చేస్తున్నారు. తాము కట్టిన ఫీజు వాపసు ఇవ్వకుండా కళాశాలల యాజమన్యాలు తల్లిదండ్రులను తిప్పించుకుంటున్నాయి. దీంతో తల్లిదండ్రులు నష్టపోతున్నారు. డిగ్రీ మాదిరిగా ఇంటర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపడితే ఇలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉండదు. చెల్లించే ఫీజు వివరాలు కూడా ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లో కనిపిస్తాయి. దీంతో ఎక్కువ ఫీజును కట్టే అవకాఽశం కూడా ఉండదు.

కళాశాలల వివరాలు (ప్రభుత్వ, ప్రైవేట్‌)

ఆదిలాబాద్‌ 76

నిర్మల్‌ 63

మంచిర్యాల 62

కుమురం భీం ఆసిఫాబాద్‌ 48

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement