
భావితరాలకు సేంద్రియసాగు అందించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): భావి తరాలకు సేంద్రియ సాగును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గ్రామ వికాస్ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ జిన్నా సత్యనారాయణరెడ్డి అన్నారు. ఉగాది పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నర్సింగాపూర్ రాజేశ్వర్‌రావుపల్లెలో జిల్లా గ్రామ వికాస్ ఆధ్వర్యంలో భూ సుపోషణ్ కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని పలువురు దంపతులు తీసుకువచ్చిన మట్టికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిన్నా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, రైతులు క్రిమి సంహారక మందులు, ఫర్టిలైజర్ మందలు వాడి భూమిని, నీటిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భావితరాలు చౌడు నేలలు చూస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక పద్ధతిలో పూజలు చేసి ఆ పూజా ద్రవ్యాలను నాలుగు దిక్కులుగా చల్లితే కొంతమేర అయినా కాలుష్యం తగ్గుతుందన్నారు. దీనిని ఉద్యమంగా చేపట్టాలని ముఖ్యంగా మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే రైతులు ఇకనైనా మేల్కొని ప్రకృతి వ్యవసాయం చేసేలా చూడాలని అన్నారు. ప్రకృతిలో లభించే వనరులను సద్వినియోగం చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా రసాయన ఎరువులు వినియోగించకుండా భూమిని ఆరోగ్యవంతంగా ఉంచాలనే లక్ష్యంపై రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ కృష్ణభాస్కర్, గ్రామ భారతి జిల్లా సంయోజక్ బొలిశెట్టి తిరుపతి, సహ సంయోజక్ వెంబడి కిషన్, జిల్లా సభ్యులు దుర్గం బక్కయ్య, కటుకూరి తిరుపతి, మండల సంయోజ్ లగిశెట్టి వెంకటి, సేంద్రీయ రైతులు వెంకటరెడ్డి, శంకరయ్య, నందయ్య, పర్వతాలు, రామయ్య, లచ్చయ్య, లక్ష్మయ్య, స్థానిక రైతులు పాల్గొన్నారు.
గ్రామ వికాస్ ప్రముఖ్
జిన్నా సత్యనారాయణరెడ్డి
ఘనంగా భూ సుపోషణ్ కార్యక్రమాలు