
‘ముందస్తు’ రాయితీ
● గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు అంతంత మాత్రమే ● పూర్తి ఆస్తిపన్ను చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ పథకం ● వసూలైతేనే మున్సిపాలిటీలకు నిధులు
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రభుత్వం ‘ఎర్లీబర్డ్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా చెల్లించిన వారికి పన్నులో 5శాతం రాయితీ కల్పిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు మార్చి నెలాఖరున ముగిశాయి. నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభంతో ముందస్తు పన్ను వసూళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిల వసూళ్లు అంతంత మాత్రంగానే రావడం, పన్ను వసూళ్లు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడడం వంటివి జరగకుండా ఉండేందుకు, 2025 మార్చి వరకు ఉన్న పూర్తి పన్ను బకాయిలను చెల్లించిన వారికి ముందస్తుగా 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను చె ల్లించేందుకు ఈ పథకాన్ని మరోసారి అమల్లోకి తీ సుకు వస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు పన్ను చెల్లింపులను ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశ్యం. 5శాతం రా యితీ అందించనుండడంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తేనే పథకం వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రచారం కల్పిస్తేనే..
ఎర్లీ బర్డ్ పథకంపై మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది ఇప్పటి నుంచే ప్రచారం చేపట్టి పన్నులు వసూలు చేయాలి. సరైన ప్రచారం లేక గత ఏడాది చాలామంది ఈ పథకం, రాయితీ విషయం తెలియక వినియోగించుకోలేదు. దీంతో మొన్నటి ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేయడం మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సవాలుగా మారింది. పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ అధికా రులు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించి పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని సూచించింది. గత మార్చి 2025 వరకు పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించని వారికి ఈ పథకం వర్తించదని, పూర్తి బకాయిలు చెల్లించిన వారు మాత్రమే అర్హులనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మున్సిపల్ అధికారులు సమాయత్తం అయ్యారు.
సద్వినియోగం చేసుకోవాలి
అన్ని మున్సిపాలిటీల్లోనూ 31 మార్చి 2025 వరకు ఇంటి పన్ను పూర్తిగా చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ స్కీం వర్తిస్తుంది. ఈ అవకాశం ఈ నెల 30వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను చెల్లించని వారు ఆయా బకాయిలను చెల్లించి, ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకో వచ్చు. ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు సద్విని యోగం చేసుకుని రాయితీ పొందాలి.
– శివాజి, మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్

‘ముందస్తు’ రాయితీ