
విచారణకు కలెక్టర్ ఆదేశం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘బతికుండగానే చంపేశారు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. పట్టాదారుకు తెలియకుండా అక్రమ పట్టా ఎలా చేశారు? దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ బెల్లంపల్లి ఆర్డీవో హరిక్రిష్ణను ఆదేశించారు. దీంతో ఆయన నెన్నెల మండల ఇన్‌చార్జి తహసీల్దార్ ప్రకాశ్‌ను ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం నెన్నెల తహసీల్దార్ సెలవులో ఉండగా, డీటీ ప్రకాశ్ ఇన్‌చార్జి తహసీల్దార్‌గా ఉన్నారు. దీంతో అసలు పట్టాదారు చనిపోయినట్లుగా సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన వారిపై, అందుకు సహకరించిన రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదిక తీసుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు తెరవెనుక తంతగం నడిపింది అక్కడ ధరణి ఆపరేటర్‌గా పని చేస్తున్న వ్యక్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అక్రమ మార్గంలో భూమి పొందాలనుకున్న వారిలో సైతం తాజా పరిణామాలతో వణుకు మొదలైనట్లుగా తెలుస్తోంది.