
అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలి
తాండూర్: తాండూర్, భీమిని, కన్నెపల్లి, మాదారం పోలీసుస్టేషన్ల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు, ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలని, ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని మాదారం పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తాండూర్ సీఐ కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గిరిజనులతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్సై సౌజన్య, సిబ్బంది పాల్గొన్నారు.